calender_icon.png 5 January, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు

04-07-2024 01:08:08 AM

  1. బీఎన్‌ఎస్ చట్టం కింద కేసు నమోదైన దేశంలోనే తొలి ఎమ్మెల్యేగా పాడి
  2. కలెక్టర్‌ను అడ్డుకున్నందుకు క్రిమినల్ కేసు
  3. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపైనా కేసు
  4. ఖండించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కరీంనగర్, జూలై 3 (విజయక్రాంతి): కరీంనగర్ డీఈవోను సస్పెండ్ చేయాలని కోరుతూ కరీంనగర్ జడ్పీ సమావేశంలో కలెక్టర్‌ను అడ్డుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారంటూ జడ్పీ సీఈవో శ్రీనివాస్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. కాగా, బుధవారం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు జడ్పీ సీఈవో శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు.

తనపై నమోదైన కేసు, జరిగిన ఘటనలపై ప్రివిలేజ్ మూవ్ చేస్తానని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని గంగుల కమలాకర్ విమర్శించారు. తనను కౌశిక్‌రెడ్డి దూషించి, బెదిరించాడని ఆరోపిస్తూ చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ కూడా కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కాగా, దేశంలో బీఎన్‌ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్‌రెడ్డి నిలిచారు.

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై.. 

కుమ్రంభీం ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌పై అనుచిత వాఖ్యలు చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం తన  నివాసంలో ఎమ్మెల్యే లక్ష్మి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక డీసీసీ అధ్యక్షుడు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన అనుచర గణాన్ని బెదిరింపులకు గురిచేస్తూ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే నేరుగా వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు : కేటీఆర్ 

ఎమ్మెల్యేలపైనా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై నమోదు చేసిన అక్రమ కేసును ఖండించారు. స్థానిక ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకుల వైఖరిని తెలిపినందుకు పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు.