calender_icon.png 4 March, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ బాబా అభయ్ సింగ్‌పై కేసు

03-03-2025 11:58:29 PM

గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన వైనం..

తక్కువ పరిమితి కావడంతో బెయిల్‌పై విడుదల..

జైపూర్: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ద్వారా ఐఐటీ బాబాగా ప్రాచుర్యం పొందిన అభయ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. జైపూర్‌లోని ఒక హోటళ్లో బస చేసిన అభయ్ సింగ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టబడడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. అయితే అభయ్ దగ్గర గంజాయి స్వల్ప పరిమితిలో ఉండడంతో కొన్ని గంటల తర్వాత ఐఐటీ బాబాను బెయిల్ బాండ్‌పై విడుదల చేశారు.

హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం కొంతకాలం కార్పొరేట్ సంస్థలో పనిచేసినట్లు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. ఇటీవలే మహాకుంభమేళాకు వచ్చి ఒక వార్తా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా ఆయన పేరు మార్మోగిపోయింది. పోలీసు చర్య అనంతరం ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన బెదిరించిన ఒక వీడియో బయటకు రావడంతో ఆయన మద్దతుదారుల్లో ఆందోళన వ్యక్తమయింది. ఇదే సమయంలో కొందరు భక్తుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం గమనార్హం.