30-03-2025 12:10:51 AM
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యంతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారనే ఆరోపణలో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. షేక్ హసీనాతోపాటు మరో 72 మందిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. షేక్ హసీనాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణలోకి తీసుకున్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టాలని సీఐడీని కోరింది.
గతేడాది డిసెంబర్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఆన్‌లైన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐడీకీ స్పష్టమైన సమాచారం అందింది. ‘జాయ్ బంగ్లా బ్రిగేడ్’ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా బంగ్లాలో మళ్లీ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హసీనా కుట్ర పన్నుతున్నారంటూ సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ అంశంపై అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లా నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకుంటున్నారు.