calender_icon.png 7 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్‌పై కేసు కొట్టివేత

07-11-2024 01:06:32 AM

అమరావతి, నవంబర్ 6 (విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డిలపై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. పోలీసులు యాంత్రికంగా కేసు నమోదు చేశారని తప్పుపట్టింది. వాళ్లపై ఎఫ్‌ఐఆర్ కొనసాగింపు చట్ట వ్యతిరేకం అవుతుందని చెప్పింది.

అందుకే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరిస్తున్నట్టు జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ బుధవారం చెప్పారు. అల్లు అర్జున్ తన స్నేహితుడు రవిచంద్ర ఇంటికి వెళ్లడం వ్యక్తిగత విషయమని, ఆ సమయంలో అక్కడ అభిమానులు గుమికూడారని, వారిని ఎవరూ ఆహ్వానించలేదని చెప్పారు. దీనిపై తహశీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం చెల్లదని చెప్పారు. జనం వల్ల ఎలాంటి ఆటంకాలు ఏర్పడటం లేదా ఎవరైన గాయపడటం వంటివి జరగలేదన్నారు.

ఈ ఏడాది మే 11న ఎన్నికల సమయంలో నాటి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లినప్పుడు జనం గుమిగూడారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగిందని వారిపై నంద్యాల రూరల్ డిప్యూటీ తహశీల్దార్ పీ రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు అదేరోజు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టేయాలంటూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.