calender_icon.png 12 March, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టల్లో శవమై కనిపించిన కార్పెంటర్

11-03-2025 09:49:10 AM

హుస్నాబాద్, (విజయక్రాంతి) : రెండు నెలల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి  శవమై కనిపించాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ కు చెందిన బండోజు నరసింహాచారి(55) సోమవారం గ్రామంలోని గుట్టల్లో చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసింహాచారి కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుర్లు కాగా, ఇద్దరు బిడ్డలకు పెండ్లీలు చేశాడు. చిన్న కూతురు వికలాంగురాలు కావడంతో ఇంటివద్దనే ఉంటోంది. నరసింహాచారి భార్య రాజమణి మధుమేహంతో బాధపడుతోంది. ఆయనకు కూడా మెడనరాలు బలహీనంగా ఉండడంతో ఇద్దరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

చేసిన కష్టం మందులకు సరిపోవడంలేదు. దీంతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు. ఆరోగ్యాలు బాగలేకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఎప్పుడూ బాధపడుతూ కనిపించేవారు. ఇదే ఆలోచనలు పెట్టుకొన్న నరసింహాచారి రెండు నెలల క్రితం అర్ధరాత్రి ఒంటికి అంగీ వేసుకోకుండానే ఇంట్లో నుంచి  బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయన కోసం తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. నెలరోజుల క్రితం సైదాపూర్ మండలం బొమ్మకల్ లో  కనిపించాడని కొందరు సమాచారం ఇచ్చారు.

దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా అప్పటికే వెళ్లిపోయాడని చెప్పారు. ఆయన కోసం ఎంత తిరిగినా దొరకలేదు. సోమవారం  మహ్మదాపూర్ సమీపంలోని గుట్టల్లో చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీని మేకలకాపరులు చూశారు. ఆ డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేకుండా ఉంది. వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. సమీపంలో ఉపాధి పనిచేస్తున్న కొందరు గ్రామస్తులు కూడా వెళ్లి చూశారు. నరసింహాచారి బట్టతలనుబట్టి డెడ్ బాడీ ఆయనదేనని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నరసింహాచారి తాటికమ్మతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.