calender_icon.png 27 October, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

10-08-2024 01:05:13 AM

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థత 

జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో ఘటన  

గురుకులంలో పాముకాటుతో ఇటీవల ఓ విద్యార్థి మృతి

మరో ఇద్దరికి అస్వస్థత.. అయినా కళ్లు తెరవని యాజమాన్యం

జగిత్యాల, ఆగస్టు 9 (విజయక్రాంతి): రెండు వారాల క్రితం పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుతో ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో ఇద్దరు విద్యార్థు లు తీవ్ర అస్వస్థత పాలై ఆసుపత్రిలో చికిత్స పొందారు. అదృష్టవశాత్తు తిరిగి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఆ తర్వాతైనా యాజమాన్యం పిల్లల రక్షణ, భద్రతపై శ్రద్ధ తీసుకోలేదు. ఫలితంగా శుక్రవారం మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు.

ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన అనిరుధ్ (10) పెద్దాపూర్ గురుకులంలో ఆరోతరగతి చదువుతు న్నాడు. శుక్రవారం ఉదయం అనిరుధ్‌కు ఉన్నట్టుండి కడుపునొప్పి వచ్చింది. అనిరుధ్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు మొండి మోహిత్, అల్లే హేమంత్ యాదవ్ కూడా అస్వస్థతకు గురయ్యారు.

గమనించిన గురుకుల సిబ్బంది వెంటనే ముగ్గురు విద్యార్థులను మెట్‌పల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో అనిరుధ్ మృతిచెందాడు. మొండి మోహిత్, అల్లే హేమంత్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. పాము కరిచి విషమెక్కి అనిరుధ్ ప్రాణాలొదిలాడా? అనే అనుమానం అతడి తల్లిదండ్రులు, బం ధువులు వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థి మృతిచెందాడని సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే గురుకులానికి వెళ్లి ఘటనపై విచారించారు.

ఘటనకు బాధ్యులైన వారిపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకుముందు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ గురుకులానికి వెళ్లి విద్యార్థి మృతిపై ఆరా తీశారు. సిబ్బందిని విచారించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి మృతుడు అనిరుధ్ కుటుంబాన్ని పరామర్శించారు. విద్యార్థి మృతి, ఇద్దరు అస్వస్థతకు గురికావడంపై ఆర్డీవో నక్క శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఘటనపై విచారణ చేపడతామని, కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..

15 రోజుల క్రితం ఇదే గురుకులంలో చదువుతున్న మెట్‌పల్లి మండలం ఆరపేటకు చెంది న గణాదిత్య అనే 8వ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇబ్రహీం పట్నం మండలం కోమటి కొండాపూర్‌కు చెందిన గణేష్, మెట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థులు అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పుడు కోలుకున్నారు. ఆ ఘటన మరువక ముందే మరో విద్యార్థి మృతిచెందడం, తిరిగి ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతుండడం విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనలకు గురుచేస్తోంది.

ఇటీవల ఓ విద్యార్థి పాము కాటుతో మృతిచెందినా యాజమాన్యం స్పందించలేదని, ఇప్పుడు మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని మండిపడ్డారు. సిబ్బంది, గురుకుల ప్రిన్సిపాల్‌కు బాధ్యత ఉంటే, పిల్లలను బాగా చూసుకుని ఉంటే మరో మరణం సంభవించేదికాదని అభిప్రాయపడ్డారు. గురుకులంలో చదువుతున్న తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే పిల్లలను గురుకులం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లారు.

ప్రిన్సిపాల్, అధికారులకు మెమో..

పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థి మృతిచెందడంపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కలెక్టర్ సత్యప్రసాద్ వెంటనే స్పందించి గురుకుల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డితో పాటు జూనియర్ కళాశాల జగిత్యాల కన్వీనర్, ప్రిన్సిపాల్, డీసీవో శ్రీనివాస్‌కు మెమోలు జారీ చేశారు.