నేడు సంస్థ 67వ వార్షికోత్సవం
1.12 లక్షల మంది అధికారులకు శిక్షణ
ఇరిసెట్‌లో శిక్షణ కోసం విదేశీయుల రాక
హైదరాబాద్, నవంబర్ 2౩ (విజయక్రాంతి): ఏడాదికి సగటున 5,300 రైల్వే అధికారులు, పర్యవేక్షకుకు శిక్షణ ఇచ్చే సంస్థ ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్. ఇరిసెట్‌గా పేరుగాంచిన ఈ సంస్థ నగరంలోని తార్నాకలో ఉంది. ఇప్పటివరకు 1,12, 842 మంది రైల్వే అధికారులు, సిబ్బందికి ఈ ఇనిస్టిట్యూట్ శిక్షణ ఇచ్చింది. 67వ వార్షికోత్స వాన్ని జరుపుకోనున్న ఇరిసెట్.. రైల్వే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ రంగాలలో శిక్షణ ఇవ్వడంలో దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న 8 శిక్షణా సంస్థలలో ఒకటి. రైల్వే సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ ఇంజినీర్లను తయా రు చేయడంలో ఇరిసెట్ ఇచ్చే శిక్షణ దేశవిదేశాల్లో పేరెన్నికగన్నది.
ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఇరిసెట్ నేటితో 67 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా రైల్వే శాఖకు చెందిన ప్రతినిధులు హాజరవుతారు. ఇరిసెట్ క్యాంపస్‌లో దాదాపు 500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అవుట్‌డోర్ సిగ్నలింగ్, ట్రైన్ డిటెక్షన్, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్, ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, బ్లాక్ సిగ్నలింగ్, టెలిఫోనీ, నెట్‌వర్కింగ్ వంటి విభిన్న విభాగాలలో ఇరిసెట్‌లో 13 ప్రయోగశాలలు ఉన్నాయి.
దేశవిదేశాలకు చెందిన అనేక సంస్థలకు శిక్షణ..
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్.వి.ఎన్.ఎల్ ) రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఆర్.సి.ఐ.ఎల్ ) వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, మెట్రో రైల్వేస్ ప్రతినిధులు కూడా ఇరిసెట్‌లో ఆధునిక సాంకేతికతలపై శిక్షణ పొందారు. రైల్వే సిగ్నలింగ్‌పై మలేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ మొదలైన దేశాల నుంచి 332 మంది విదేశీ ట్రైనీలకు శిక్షణనిచ్చిన ఘనత ఈ సంస్థకు ఉంది.
ఇరిసెట్ దేశ నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలను రూపొందించడానికి పర్యావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రైవేట్ పరిశ్రమ, కాంట్రాక్ట్ ఏజెన్సీల సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తుంది. రైల్వే ప్రమాదాలు అరికట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇండియన్ రైల్వేస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్‌పై పరిశోధన చేయడానికి ఇన్‌స్టిట్యూట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సి.ఓ.ఈ) స్థాపించారు. కవచ్ సాంకేతికత విస్తరణ కోసం సలహాలను కూడా ఇరిసెట్ అందిస్తూ ప్రమాదాలను అరికడుతూ ప్రయాణికుల ప్రాణాలకు భరోసానిస్తోంది.