సీఐఐ- ఐజీబీసీ వైస్‌చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి
భవన నిర్మాణాలలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని సీఐఐ వైస్ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి సూచించారు. ఈ నెల 17, 18, 19 తేదీలలో హైదరాబాద్ కేంద్రంగా గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం ఆయన ‘విజయక్రాంతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. భవన నిర్మాణ రంగంపై ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, మే 11 (విజయక్రాంతి): నిర్మాణ రంగంలో వాడుతున్న మెటీరియల్స్ వలన వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. కాంక్రీట్, స్టీల్, ఇన్సులేషన్ మెటీరియల్స్ వంటివి ఉత్పత్తి చేస్తున్న సమయంలోనూ, వాటి రవాణా, నిర్మాణం, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం వంటి అన్ని సందర్భాల్లోనూ కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఈ క్రమంలోనే భవన నిర్మాణాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.
పెద్దపెద్ద భవనాలనే కాకుండా సాధారణ నివాసాలను కూడా హరిత ఇళ్లుగా మార్చవచ్చు. నేషనల్ బిల్డింగ్ కోడ్, ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్‌కు అనుగుణంగా ఇళ్లను నిర్మిస్తే స్థిరమైన పర్యావరణానికి దోహదపడుతుంది. కానీ డెవలపర్లు సులభమైన, వేగవంతమైన కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. బిల్డర్లు ఎనర్జీ ఎఫిషియన్సీని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.
అంతర్జాతీయంగా 37 శాతం...
అంతర్జాతీయంగా విడుదలవుతున్న మొత్తం కర్బన ఉద్గారాల్లో సిమెంట్, స్టీల్, అల్యూమినియం వంటి నిర్మాణ మెటీరియల్స్ ద్వారా 37 శాతం వస్తున్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. బిల్డర్లు వాణిజ్య, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్స్ పాటించాలి. బయటి గోడలు, రూఫ్, కిటికీలు, డోర్లు ఇలా అన్నింట్లో ఈ నిబంధనలు పాటించాలి. వీటి వలన ఇంటి లోపల గాలి నాణ్యతను మెరుగవుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భవనాన్ని జీరో ఎనర్జీ బిల్డింగ్‌గా చేసుకోవచ్చు.
ఇంధన డిమాండ్‌ను తగ్గించుకోవాలి
ఇంధన డిమాండ్‌ను తగ్గించుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులపై వైపు వెళ్లడం సమర్థనీయం. మెటీరియల్స్‌తోపాటు లోపలి పర్యావరణ విధానం, వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్గారాల నియంత్రణ, భూమి, నీరు సక్రమంగా వినియోగిస్తేనే హరిత భవనాలు సాధ్యమవుతాయి. ప్రస్తుతం నగరాల్లో సంప్రదాయ విధానాలకు దూరంగా నిర్మాణాలు జరుగుతు న్నాయి. స్థిరమైన భవనాలకు కచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ సరిగా పాటించడంలేదు.
హరిత భవనాల నిర్మాణాలకు సంప్రదాయ నిర్మాణాల కంటే తక్కువ వ్యయం అవుతుంది. అల్లాయ్, పాలిమర్స్ వంటి తక్కువ బరువు కలిగిన మెటీరియల్స్ తోపాటు నిర్మాణ సైట్ల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పునర్ వినియోగించడం, గ్రీన్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ పాటిం చడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.