- 14౦ కంపెనీలు.. రూ.35.82 కోట్ల పెట్టుబడులు
- 51,096 మందికి లభించనున్న ఉపాధి
- ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
- ఫలించిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు కృషి
హైదరాబాద్, నవంబర్ 1౫ (విజయ క్రాంతి) : రాష్ట్రం ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ప్రస్తుతం పారిశ్రామికాభివృద్ధిలో ఫార్మా, లై ఫ్‌సైన్సెస్ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈక్రమంలో లైఫ్‌సైన్సెస్ రంగంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది.
లైఫ్‌సైన్సెస్, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదు పాయాల కల్పన, తగిన ప్రోత్సాహకాలను అందిస్తూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నది. సర్కారు సహకారం, చొరవతో ఇప్పటికే పలు కంపెనీలు తెలంగాణకు రాగా మరికొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అద్భుతమైన పారిశ్రామికాభివృద్ధి సాధించింది.
తయారీ, ఆర్‌అండ్‌డీ కంపెనీలే ఎక్కువ..
కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టాక లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు సంబంధించిన కంపెనీల ఏర్పాటుకు నడుం బిగించిం ది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలే ఇందుకు నిదర్శనం. 2023 నుంచి ఇప్పటి వరకు లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగానికి చెందిన దాదాపు 140 కంపెనీలు ముందుకొచ్చాయి. వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీలే ఎక్కువగా ఉండడం విశేషం.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు 59, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్, ఆర్ అండ్ డీ 49, వ్యాక్సిన్, బయోసిమిలర్స్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీలు 9, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(జీసీసీ) 13, మెడికల్ డివైజెస్ అండ్ హెల్త్‌కేర్ కంపెనీలు 6, జీనోమ్‌వ్యాలీ ప్లగ్ అండ్ ప్లే ఇన్‌ఫ్రా/ ల్యాబ్‌స్పేస్ కంపెనీలు 3 పెట్టుబడులు పెట్టా యి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.35,820 కోట్ల పెట్టుబడులు రాగా, 51,096 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
కనిపించిన విదేశీ పర్యటనల ఫలితం..
రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటే ప్రధానమని భావించిన సర్కారు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రెండు విదేశీ పర్యటనలు చేశారు.
పదినెలల కాలంలోనే దావోస్, అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ప్రపంచ వేదికలపై వెల్లడించారు. ఫలితంగా చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చాయి. వీటిలో కొన్ని ఒప్పందాలు చేసుకోగా మరికొన్ని నిర్మాణ దశలో.. పలు కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.