2024లో 43 లక్షల యూనిట్లు విక్రయం
న్యూఢిల్లీ, జనవరి 1: మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా, కిర్లోస్కర్ మోటార్‌లు దేశీయంగా రికార్డు వార్షిక విక్రయాలు జరపడంతో 2024 సంవత్సరం మొత్తంమీద దేశంలో పాసింజర్ వాహన అమ్మకాలు 43 లక్షల యూనిట్లకు చేరాయి.
ఎస్‌యూవీల అమ్మకాల వృద్ధి కొనసాగడం, కార్ల అమ్మకాల్ని గ్రామీణ మార్కెట్లు పెంచడంతో ఆటోమొబైల్ కంపెనీలు జోరు చూపించాయని, 2023లో నమోదైన 41.09 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 2024లో 4.7 శాతం వృద్ధి సాధించినట్లు మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ వెల్లడించారు.
2024 క్యాలండర్ సంవత్సరంలో పాసింజర్ వాహన పరిశ్రమ స్వల్ప వృద్ధిని కనపర్చి 43 లక్షల యూనిట్లను విక్రయించిందని, ఎస్‌యూవీల విభాగం పటిష్ఠ వృద్ధిని ప్రదర్శించిందని టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర చెప్పారు.
డిసెంబర్‌లోనూ అమ్మకాల జోరు
దేశంలో కార్ల అమ్మకాలు 2024 డిసెంబర్‌లో సైతం జోరుగా పెరిగాయి. మారుతి సుజుకి దేశీయ విక్రయాలు అంతక్రితం ఏడాది ఇదేనెలతో పోలిస్తే 24 శాతం వృద్ధిచెంది 1,04,778 యూనిట్ల నుంచి 1,30,117 యూనిట్లకు పెరిగాయి. డిసెంబర్ నెలలో హ్యుందాయ్ మోటార్స్ దేశీయ అమ్మకాలు మాత్రం 1.3 శాతం క్షీణించి 42,750 యూనిట్ల నుంచి 42,208 యూనిట్లకు తగ్గాయి.
2024 డిసెంబర్‌లో టాటా మోటార్స్ పాసింజర్ వాహన విక్రయాలు 1 శాతం వృద్ధిచెంది 43,675 యూనిట్ల నుంచి 44,289 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా పాసింజర్ వాహన అమ్మకాలు డిసెంబర్ నెలలో 18 శాతం వృద్ధిచెంది 35,174 యూనిట్ల నుంచి 41,424 యూనిట్లకు పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ విక్రయాలు డిసెంబర్‌లో 55 శాతం పెరిగి 7,516 యూనిట్లకు చేరాయి.
డిసెంబర్‌లో నిస్సాన్ మోటార్ హోల్‌సేల్ అమ్మకాలు 51.4 శాతం వృద్ధితో 7,711 యూనిట్ల నుంచి 11,676 యూనిట్లకు పెరిగాయి. లగ్జరీ కార్ల విభాగంలో జర్మనీ కార్ల కంపెనీ ఆడి సరఫరా సమస్యల కారణంగా దేశీయ మార్కెట్లో డిసెంబర్ నెలలో భారీ క్షీణతను చవిచూసింది. ఈ కంపెనీ అమ్మకాలు 7,931 యూనిట్ల నుంచి 5,816 యూనిట్లకు తగ్గాయి.
మారుతి సుజుకి కొత్త రికార్డు
తమ మారుతి సుజుకీ ఒక్కటే 2024లో హోల్‌సేల్‌గా 17,90,977 యూనిట్లు విక్రయించి ఆరేండ్ల రికార్డును బ్రేక్ చేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెనర్జీ చెప్పారు. 2018లో మారుతి 17,51,919 యూనిట్లను విక్రయించింది. రిటైల్‌గా కూడా 2024లో 17,88,405 మారుతి కార్లు అమ్ముడయ్యాయని, 2023లో నమోదైన 17,26,661 యూ నిట్ల రికార్డును అధిగమించినట్లు బెనర్జీ వివరించారు.
టాటా మోటార్స్ వరుసగా నాల్గవ ఏడాది అమ్మకాల్ని పెంచు కున్నది. 2024లో టాటా మోటార్స్ 5.65 లక్షల యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఇండి యా 2024లో స్వల్ప వృద్ధి కనపర్చినప్పటికీ, రికార్డు వార్షిక విక్రయాల్ని నమోదు చేసింది. 2023లో ఈ కంపెనీ 6,02,111 యూనిట్లను, 2024లో 6,05,433 యూనిట్లను విక్రయించిం ది.
మరో ఆటోమొబైల్ కంపెనీ టొయో టా కిర్లోస్కర్ మోటార్ 2024 క్యాలండర్ సంవత్సరంలో 3,26,329 యూని ట్లను విక్రయించింది. 2023లో అమ్మకాలు 2,33,346 యూనిట్లతో పోలిస్తే 40 శాతం వృద్ధి సాధించింది. తమ అమ్మకాల వృద్ధికి ఎస్‌యూవీ, ఎంపీవీ విభాగాలు కారణమని టొయోటా కిర్లోస్కర్ వైస్ ప్రెసిడెంట్ సబరి మనోహర్ చెప్పారు.
ఇదేరీతిలో కియా ఇండియా 2024లో రికార్డు అమ్మకాల్ని సాధించింది. ఈ కంపెనీ అమ్మకాలు 6 శాతం పెరిగి 2,40,919 యూనిట్ల నుంచి 2,55,038 యూనిట్లకు చేరాయి. 2024 కియా ఇండియా భవిష్యత్ వృద్ధి కి పునాది వేసిందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.