calender_icon.png 11 October, 2024 | 1:58 AM

రివర్స్‌గేర్‌లో కార్ల అమ్మకాలు

02-10-2024 12:00:00 AM

తగ్గిన మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్ విక్రయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 1 : డిమాండ్ తగ్గిన నేపథ్యంలో డీలర్లు వారి నిల్వల్ని తగ్గించుకుంటున్నదున, సెప్టెంబర్ నెలలో కార్ల హోల్‌సేల్ విక్రయాలు క్షీణించాయి. పాసింజర్ కార్ల విభాగంలో ప్రధాన కంపెనీలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ హోల్‌సేల్ విక్రయాలు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో మారుతి పాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు 1,44,962 యూనిట్లకు పడిపోయాయి.

నిరుడు ఇదే నెలలో ఈ కంపెనీ 1,50,812 యూనిట్లను విక్రయించింది. ఆల్టో, ఎస్‌ప్రెసోలతో కూడిన తమ మినీ కార్ల విభాగంలో అమ్మకాలు మాత్రం స్వల్పంగా 10,351 యూనిట్ల నుంచి 10,363 యూనిట్లకు పెరిగాయని మారుతి తెలిపింది. బలెనో, సెలారియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ తదితర కాంపాక్ట్ కార్ల విక్రయాలు 68,551 యూనిట్ల నుంచి 60,480 యూనిట్లకు తగ్గాయన్నది.

బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్‌క్రాస్, ఎక్‌ఎల్6 తదితర యుటిలిటీ వాహన అమ్మకాలు 4 శాతం పెరిగి 59,272 యూనిట్ల నుంచి 61,549 యూనిట్లకు చేరినట్లు మారుతి వివరించింది.  హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 6 శాతం తగ్గి 54,241 యూనిట్ల నుంచి 51,101 యూనిట్ల వద్ద నిలిచాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా టాటా మోటార్స్ మొత్తం పాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు 8 శాతం క్షీణించి 44,809 యూనిట్ల నుంచి 41,063 యూనిట్లకు పడిపోయాయి. 

పెరిగిన మహీంద్రా ఎస్‌యూవీ అమ్మకాలు

ఈ సెప్టెంబర్ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం తన ఎస్‌యూవీల హోల్ అమ్మకాల్ని భారీగా 24 శాతం వృద్ధితో 51,062 యూనిట్లకు పెంచుకున్నది. టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 14 శాతం పెరిగి 26,847 యూనిట్లకు చేరాయి. కియా ఇండియా సేల్స్ 17 శాతం పెరిగి 23,523 యూనిట్లకు చేరాయి. ఏఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ విక్రయాలు మాత్రం 8 శాతం క్షీణించి 4,588 యూనిట్ల వద్ద నిలిచాయి. 

పండుగ సీజన్‌పై ఆశలు

సెప్టెంబర్‌లో అమ్మకాలు తగ్గినప్పటికీ, పండుగ సీజన్లో కొంతమేర వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నట్లు  మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు పండుగ సీజన్లో అమ్మకాలు పటిష్ఠంగా ఉంటాయన్న సంకేతాలు కన్పిస్తున్నాయని టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. ఈ పండుగ  సీజన్‌లో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నట్లు హ్యూందాయ్ మోటార్ తెలిపింది.

ద్విచక్ర వాహనాల జోరు 

సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాలు క్షీణించినప్పటికీ, ద్విచక్ర వాహన విక్రయాలు జోరుగా పెరిగాయి. ప్రధాన కంపెనీలైన బజాజ్ ఆటో, హీరో మోటో, టీవీఎస్ మోటార్స్ విక్రయాలు వృద్ధిచెందాయి. బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 23 శాతం పెరిగి 2,53,193 యూనిట్ల నుంచి 3,11,887 యూనిట్లకు చేరాయి.

హీరో మోటో అమ్మకాలు 5,36,499 యూనిట్ల నుంచి 6,37,050 యూనిట్లకు పెరిగాయి. టీవీఎస్ మోటార్ అమ్మకాలు 20 శాతం వృద్ధిచెంది 4,82,495 యూనిట్లకు చేరాయి. తమ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 42 శాతం పెరిగి 28,901 యూనిట్లకు చేరినట్లు టీవీఎస్ మోటార్ తెలిపింది.