calender_icon.png 7 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు రేసింగ్ కేసు రెండ్రోజుల్లో నోటీసులు!

07-11-2024 01:56:36 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6(విజయక్రాంతి) : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టడంతోపాటు ఆర్‌ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలు  పెట్టింది.

ఆర్‌ఈలో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి? అనేదానిపై విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి, బాధ్యులకు నోటీసులు ఇచ్చి విచారించే అవ కాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్టు ఏసీబీ గుర్తించింది.

మున్సిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు కూడా నోటీసులు జారీచేయనున్నారు. రేస్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఏసీబీకి ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

ఈ రూ.55 కోట్లు అక్రమాలు జరిగినట్టు గుర్తించిన మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎస్‌లు సహా అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినట్టు సమాచారం. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత వచ్చేవారం నుంచి కేసుతో సంబంధం ఉన్నవారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి, విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నారు.

ఐఏఎస్‌లు మొదలు కీలక అధికారులు, నాటి ప్రజాప్రతినిధుల దాక వీరిలో ఉండే అవకాశం ఉంది.  కాగా ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.