calender_icon.png 10 March, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగిన ఉన్న లారీని ఢీకొట్టిన కారు

10-03-2025 01:11:43 AM

నల్లగొండ, మార్చి 9 (విజయక్రాంతి) : ఆగిన లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఏపీలింగోటం వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని లోతుకుంట కుమ్మరి బస్తీకి చెందిన చిలాసాగరం సందీప్‌గౌడ్ అతడి స్నేహితులు కుంచ సాయికుమార్‌గౌడ్, దండుగుల మధుకర్, హరీష్, ప్రవీణ్ అల్వాల్ నుంచి కారులో విజయవాడకు బయల్దేరారు. నార్కెట్‌పల్లి మండలం ఏపీలింగోటం శివారుకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలిపిన లారీని వెనుక నుంచి అతివేగంగా బలంగా ఢీకొట్టింది.

దీంతో కారు నుజ్జునుజ్జయి సందీప్‌గౌడ్, సాయికుమార్‌గౌడ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక కామినేని దవాఖానకు తరలించారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు పంపారు.

జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూశారు. మృతుడు సందీప్‌గౌడ్ అన్న అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డీ. క్రాంతికుమార్ వెల్లడించారు.