12-04-2025 01:18:22 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి సమీపంలో బంగారు కత్వ చెరువు కట్టపై శుక్రవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి తాటి చెట్టును ఢీ కొట్టి దగ్ధమైంది. ఈ ఘటనకు ముందుగానే కారు డ్రైవర్ కారులోంచి పక్కనే ఉన్న పొలాల్లోకి దూకడంతో ప్రాణాపాయం తప్పినప్పటికీ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనను సమీపంలోని పెట్రోల్ పంపు సిబ్బంది గమనించి 108 అంబులెన్స్ కు, కేసముద్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడ్డ సుమన్ ను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం జీబీ తండా కు చెందిన సుమన్ హనుమకొండలో బేకరీ నిర్వహిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కొడకండ్లకు కారులో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.