19-02-2025 10:19:18 PM
బైకును ఢీకొట్టి పరార్..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ముందు ఒక కారు అత్యంత వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పరారయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో ద్విచక్రవాహనదారులు తీవ్రగాయాల పాలయ్యారు. నాగర్ కర్నూల్ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన సంతోష్ లక్ష్మి ఇరువురికి కొద్ది రోజుల క్రితమే వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనుల్లో భాగంగా బిజినపల్లి మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా నాగర్ కర్నూల్ నుండి వనపర్తి ప్రాంతానికి వెళ్తున్న ఒ కారు అత్యంత వేగంతో బైకును ఢీకొట్టి పరార్ అయింది.
దీంతో తీవ్రగాయాల పాలైన వారిని స్థానికులు 108 సాయంతో జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేసి నల్లవాగు సమీప ప్రాంతంలో కారును దాచిపెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని గుర్తించిన పోలీసులు కారుతో పాటు ఓ పోలీస్ ఉద్యోగిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసిన్యంగా తెలిసింది. మరో పోలీస్ అధికారి పరారీలో ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గోవర్ధన్ తెలిపారు.