చిన్న వయసు నుంచే ఫొటోగ్రఫీని తన అభిరుచిగా మార్చుకుంది శ్రేయోవి. తన నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంది. తరచూ తన తల్లిదండ్రులతో కలిసి జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్ని సందర్శిస్తుంది. అక్కడి వన్య ప్రాణు ల్ని, ప్రకృతి అందాల్ని కెమెరాలో బంధిస్తుంటుంది. ఇక ఈ ఫొటోల్ని ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేస్తుంటుందీ ఫొటోగ్రాఫర్. అలా ఇటీవలనే తన తల్లిదండ్రులతో కలిసి రాజస్థాన్ భరత్‌పూర్‌లోని నేషనల్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లింది శ్రేయోవి.
ఓ రోజు ఉదయం పూట పార్క్ లో జాగింగ్ చేస్తున్న ఆమెకు రెం డు ఆడనెమళ్లు కనిపించాయి. తెలతెలవారుతున్న ఆ సమయంలో గుబురుగా ఉన్న చెట్ల మధ్యన ఒకదానికొకటి వ్యతిరేక దిశలో నిల్చున్న ఈ నెమళ్ల ద్వయాన్ని చూడగానే ఆమెకు ముచ్చటేసింది. వెంటనే ఈ సీన్ని తన కెమెరాలో బంధించిందామె. ఈ అందమైన ఫొటోను ‘ఇన్ ది స్పాట్లైట్’ పేరుతో ఈ ఏడాది నిర్వహించిన ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కంటెస్ట్’కి పంపించింది శ్రేయోవి. 117 దేశాల నుంచి సుమారు 60 వేల మంది ఈ పోటీలో పాల్గొనగా.. ‘10 ఇయర్స్ అండ్ అండర్’ కేటగిరీలో ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ - 2024’ రన్నరప్‌గా అవార్డు గెలుచుకుందామె.