calender_icon.png 29 September, 2024 | 3:52 AM

9౦ శాతానికి పైగా తగ్గిన మూలధన వ్యయం

29-09-2024 01:15:05 AM

  1. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి
  2. కరోనా కాలంలోనూ ఇంతలా తగ్గలేదు
  3. రాబడులు తగ్గడమే వ్యత్యాసానికి కారణం 

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలోని ఆగస్టు నెల లో మూలధన వ్యయం భారీగా తగ్గినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. బడ్జెట్ అంచనాల్లో ఏకంగా సగం తగ్గడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.

గతేడాది బడ్జెట్ అంచనాల్లో ఆగస్టులో మూలన వ్యయం 49.12 శాతం ఉండగా.. ఈసారి మాత్రం అది 24.87 శాతానికి పడిపోయింది. అంటే గతేడాదితో పోలిస్తే వ్యత్యాసం ౯౦ శాతానికి పైన ఉంది. అభివృద్ధి, రక్షణ సంబంధిత వ్యయాలు, రాష్ట్రాలకు కేంద్రమిచ్చే రుణాలను కలిపి మూలధన వ్యయంగా పరిగణిస్తారు.

కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రుణాలు రాకపోవడం, ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు దాదాపు 50 శాతానికి పైగా పోతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఇస్టానుసారంగా చేసిన అప్పులకు వడ్డీలను కట్టడానికి ప్రభుత్వానికి కొత్త రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే అభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో నిధులను కేటాయించలేని పరిస్థితి నెలకొంది.

2020-21 తర్వాత ఇప్పుడే అధిక వ్యత్యాసం

గత తొమ్మిదేళ్లలో క్యాపిటల్ వ్యయంలో ఆగస్టులో ౯౦ శాతానికి పైగా వ్యత్యాసం రావడం ఇదే తొలిసారి అని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.56 శాతం తక్కువగా ప్రభుత్వం మూలధన వ్యయాన్ని నమోదు చేసింది.

ఈ ఏడాది ఏకంగా ౯౦ శాతం వ్యత్యాసం రావడం గమనార్హం. ఇదిలాఉండగా.. ఇదే సమయంలో 2023-24లో మూలధన వ్యయం రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులను భారీగా వెచ్చించింది.

క్యాపిటల్ వ్యయంపై రాబడుల ఎఫెక్ట్

మూలధన వ్యయం తగ్గడానికి రాబడులు ఆశించిన మేర రాకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. రెవెన్యూ రాబడులు ఆగస్టు నాటికి బడ్జెట్ అంచనాల్లో 27.85 శాతం వచ్చాయి. గతేడాది ఇదే నెలలో 33.68 శాతం వచ్చాయి. గతేడాది కంటే ఈసారి 5.83 శాతం వసూళ్లు తగ్గాయి. ఇదే విధంగా మూలధన రాబడులు కూడా దాదాపు 5 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాపిటల్ వ్యయంలో బడ్జెట్  అంచనాలను అందుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.