28-01-2025 12:00:00 AM
దోర్బల బాలశేఖరశర్మ :
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఇటీవల ప్రకటించారు. యదావిధిగా సమయాన్ని కుదింపజే శారు. చాలా తక్కువ ముందస్తు సమయం తో పార్లమెంట్ సమావేశాల నోటీసును విడుదల చేశారు. చరిత్రలోకి వెళితే, భారత పార్లమెంటు సమావేశాల సన్నద్ధత కోసం ఎంపీలకు మొదట్లో తగినంత సమయం లభిస్తూ వచ్చింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన మొదటి రెండు లోక్‌సభలు (1952-1962) ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాయి. నోటీసు ఇచ్చిన సమయానికి, సెషన్ ప్రారంభానికి మధ్య సగటున 47 రోజుల గడువు ఉండేది. అయితే, తదనంతరం గత కొన్నేళ్లుగా, ఈ అంతరం గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. దీనికి సంబంధించి ఒక ముందస్తు క్యాలెండర్ (సమయ ప్రణాళిక) నిర్ధారణ ఆవశ్యకతను ఇప్పటికైనా దేశ అత్యున్నత ప్రజాప్రతినిధుల నాయకత్వం గుర్తించాలి.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో సెషన్లను పిలవడానికి సగటు ముందస్తు సమయం 17 రోజుల(నోటీసు)కు పడిపోయింది. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యల్ప ముందస్తు సమయం. ఈసారి అయితే, బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీ (జనవరి 31)ని ప్రకటిస్తూ పార్లమెంటరీ బులెటిన్ జనవరి 17న ప్రకటితమైంది.
అంటే, కేవలం 15 రోజుల ముందస్తు నోటీసు మాత్రమే! గడచిన రెండు దశాబ్దాలుగా భారత పార్లమెంటు ఈ రకమైన పద్ధతిలోనే సమస్యా త్మక ధోరణిని చవిచూస్తున్నది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు దెబ్బతింటున్నది. నోటీసుల జారీకి, సమావేశాల ప్రారంభ తేదీకి మధ్య తగ్గుతున్న నిర్దిష్ట సమయం ఉత్తమ సంప్రదాయం అనిపించుకోదు.
క్యాలెండర్ ఉండాలి
పార్లమెంటు ప్రతిష్ఠను మరింతగా మసకబార్చే విధంగా వుంటున్న అనేక రుగ్మత లలో ఇదొకటి. నిజానికి కేంద్ర ప్రభుత్వ నాయకత్వానికి అనుకుంటే, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎటూ సమావేశాల సెషన్ నిర్వహించక తప్పదు. కొంచెం విశాలదృష్టితో అధికార యంత్రాంగాన్ని వేగిరం పరచగలిగితే సరిపోతుంది. కానీ, అలా ఎందుకు చేయడం లేదన్నదే ప్రశ్న.
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన అనేక ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు తమ కార్యక్రమాల క్యాలెండర్లను ముందుగానే ఏర్పాటు చేసుకోగలుగుతాయి. అటువంటప్పుడు పార్లమెంటు ఈ చిన్న కార్యం పట్ల శ్రద్ధ వహించక పోవడం దురదృష్టకరం. తగినంత ‘లీడ్ టైమ్’ (ముందస్తు సమయం)తో పార్లమెంటు కోసం క్యాలెండర్‌ను సిద్ధం చేయలేరా?! ఇలా సరైన ముందస్తు సమయం ఇవ్వడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే.
సభ్యులు ఎవరైనా సరే, పాలక ప్రతిపక్షాలు స్వతంత్ర ప్రతినిధులు అందరికీ చాలి నంత ‘లీడ్ టైమ్’ ఉండటం వల్ల వారంతా మరింత అధిక నాణ్యతతో అవుట్ పుట్ల (పనితనాన్ని)ను ఇవ్వగలరు. పార్లమెంటు సమావేశంలో తాము మాట్లాడాలనుకునే అంశాల విషయ సేకరణపట్ల మరింత శ్రద్ధ వహించే అవకాశం వారికి లభిస్తుంది. ప్రపంచంలోని అనేక ఇతర ప్రజాస్వామ్య దేశాలలాగానే మన దేశంలోను ఒక నిర్దిష్ట స్థిరమైన పార్లమెంటరీ క్యాలెండర్ పాటించడం లేదు.
అంత సమయం ఎందుకంటే?
ఏదేని రెండు సెషన్ల మధ్య కనీసం ఆరు నెలలకంటే ఎక్కువ సమయం ఉండకూడదనే రాజ్యాంగ సంప్రదాయమూ మనకు ఉంది. ఈ రకమైన ఏర్పాటువల్ల వరుసగా ప్రభుత్వాలు తమకు సరిపోయేలా సెషన్ల కోసం సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. అయితే, ఏ రాజకీయ పక్షానికైనా స్వార్థసంకుచిత వ్యూహం ఉండరాదు.
అది పార్లమెం టు పటిష్ఠతను, ప్రతిష్ఠనూ దెబ్బతీస్తుంది. ఆ ధోరణి తీవ్రమైన ప్రశ్నలనూ లేవనెత్తుతుంది. కేవలం రెండు వారాల ముందస్తు నోటీసు సభ్యులకు సరిపోతుందా?! సంసి ద్ధం కావడానికి ఎంపీలకు తగినంత సమ యం ఇవ్వకపోతే అది ఘనమైన ప్రాతినిధ్య పాలనకు ఉజ్వల ఉదాహరణ ఎలా కాగలదు?
లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు చట్టాల ను రూపొందించే విధానంలో పాలుపంచుకోవడానికి మాత్రమే కాకుండా, ప్రభుత్వా న్ని జవాబుదారీగా ఉంచడానికి, దాని చర్యలను పరిశీలించడానికి, జాతీయ ప్రాధాన్య తా అంశాలను చర్చించడానికి కూడా ఎన్నుకోబడతారు. నిర్మాణాత్మకమైన పార్లమెంట రీ క్యాలెండర్ వారితో ఈ బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వర్తించేలా చేయగలదు.
100 రోజుల ప్రణాళిక
ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చాలా దశాబ్దాల నాటివి. 1955లో, లోక్‌సభ జనరల్ పర్పస్ కమిటీ స్థిరమైన పార్లమెంటరీ క్యాలెండర్ ఆలోచనను అన్వేషించింది. ఆ తర్వాత మళ్లీ 2002లో, రాజ్యాంగం పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్ కనీస సంఖ్యలో సమావేశాల అవసరాన్ని నొక్కి చెప్పింది. దురదృష్టవశాత్తు, ఆనాటి ప్రతిపాదనలు ఇప్పటికీ అమలు కావడం లేదు.
2019లో, పార్లమెంటు సమావేశాల కోసం స్థిరమైన క్యాలెండర్‌ను ఏర్పాటు చేయడానికి, ఏడాదికి కనీసం 100 రోజులపాటు సమావేశాలను నిర్వహించాలని పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. సమావేశాలను ఆలస్యం చేయడం లేదా వాటిని తగ్గించడంతో ప్రభుత్వాలు జవాబుదారీతనం నుంచి తప్పించుకోకుండా చూసుకోవడం ద్వారా పార్లమెంటు పనితీరును మెరుగు పరచడం దీని లక్ష్యం.
ఒక నిర్ణీత టైమ్ షెడ్యూల్ పార్లమెంటు సభ్యులు తమ శాసనసభ, నియోజకవర్గ బాధ్యతలను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. బిల్లులు, విధానా లు, ప్రజా ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై చర్చలు, పరిశీలనల కోసం తగిన సమయమూ లభిస్తుంది.
కనీసం 100 సిట్టింగ్ రోజులకు హామీ ఇవ్వడం ద్వారా బిల్లువల్ల ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి, శాసన సామర్థ్యాన్ని మెరుగుపరచ డానికి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని సమర్థించడానికి అవకాశం ఏర్పడింది.
రాజ్యాంగ సభ చర్చల సమయంలోనూ కేటీ షా వంటి సభ్యులు నిర్ణీత క్యాలెండర్ లేని సౌలభ్యం దుర్వినియోగానికి దారి తీయకూడదని వాదించారు. కార్యనిర్వాహక వ్యవస్థ సరైన పర్యవేక్షణను నిర్ధారించడానికి పార్లమెంటు తరచుగా సమావేశమై ఉండాలనీ ఉద్ఘాటించారు.
సంస్కరణకు సిద్ధం కావాలి
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్విస్తోంది. అయినప్పటికీ, ప్రజాస్వామ్య బలం పరిమాణంతో కాకుండా దాని సంస్థల నాణ్యమైన పనితనం, ప్రభావాలతో కొలవాలి. పార్లమెం టు ఈ మొత్తం వ్యవస్థకు మూలస్తంభం. పౌరుల గొంతులు వినిపించేందుకు, ఆందోళనలను పరిష్కరించేందుకు సభ్యుల పనితీ రు చాలా అవసరం.
స్థిరమైన పార్లమెంటరీ క్యాలెండర్ అనేది విధానపరమైన సంస్కరణ మాత్రమే కాదు ఈ అత్యున్నత సంస్థ గౌరవ ప్రతిష్ఠలు, ఉద్దేశ్యాన్ని మరింత గొప్ప గా పునరుద్ధరించడానికి ఒక పెద్ద అడుగుగా ఉపయోగపడుతుంది. బ్రిటన్, అమెరికా వంటి దేశాలలో పార్లమెంట్, కాంగ్రెస్ సమావేశాల షెడ్యూల్స్ ముందే నిర్ణయమవుతాయి.
ఉదా॥కు యుకే హౌస్ ఆఫ్ కామ న్స్ నెలల ముందుగానే ఆమోదితమైన వార్షిక క్యాలెండర్‌ను అనుసరిస్తుంది. ఎంపీలు తమ శాసనసభ, నియోజకవర్గ విధులను సిద్ధం చేసి, సమతుల్యం చేసుకోవచ్చని నిర్ధారిస్తుంది. మొత్తం మీద ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడా లి.
ప్రజాస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌ను రక్షించడం, పార్లమెంటు తన రాజ్యాంగ ఆదేశాన్ని నెరవేర్చేలా చూసుకోవడం వంటివాటి పరిధి లోకి ఈ సంప్రదాయం వస్తుంది. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చక్కటి ప్రణాళికాబ ద్ధమైన షెడ్యూల్‌తో సమావేశాల క్యాలెండర్‌ను సిద్ధం చేసుకోవాలి.
అందుకు కనీసం 100 రోజుల ముందస్తు సమయం ఉండే లా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇప్పటికైనా పాలకవ ఉన్నత నాయకత్వం ఇందుకు సంసిద్ధం కావాలి. అయితే, రాన్రా ను ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం విస్మరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తున్నది.