22-03-2025 12:59:18 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
కరీంనగర్, మార్చ్ 21 (విజయక్రాంతి): బడ్జెట్ లో కరీంనగర్ కు దాదాపు ఎనిమిది వందల కోట్లు కేటాయించినా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కు గుండు సున్నా అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
శుక్రవారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కు 179 కోట్లు,శాతవాహన యూనివర్సిటీకి 35 కోట్లు,వరంగల్ కరీంనగర్ స్పోరట్స్ స్కూల్స్ కు 41 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి మరియు శ్రీరాంసాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కు 548 కోట్లు కేటాయించడం జరిగిందని మానేర్ రివర్ ఫ్రంట్ కు గతంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాలేదని అందుకే కేటాయించలేదని గంగుల కమలాకర్ కళ్లున్న కబోదిలాగా మాట్లాడుతున్నారని నరేందర్ రెడ్డి విమర్శించారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని అన్ని గ్రామాలకు సాగు నీళ్లిచ్చే విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని గతంలో తాగునీటికి సాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు మేము ధర్నాలు చేసినా పట్టించుకోలేదని కరీంనగర్ లో త్రాగు నీటికి ఇబ్బంది కలిగి పంప్ హౌస్ లో బూస్టర్లకు కూడా నీళ్లు అందని పరిస్థితి ఉంటే మున్సిపల్ ముందు ధర్నాలు చేశామని ఆరోజు పట్టించుకోని గంగుల ఇప్పుడు ఆ అవసరం ఏర్పడకున్నా విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
స్మార్ట్ సిటీ పనులలో అవినీతి,కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన నెలకే అప్రోచ్ రోడ్డు కుంగడం,కేబుల్ బ్రిడ్జి కి ఆరు కోట్లతో పెట్టిన డైనమిక్ లైట్లు పనిచేయకపోవడం,సుందరీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేయడం ఇవన్నీ మీవల్లే సాధ్యమైందని దుయ్యబట్టారు.గతంలో పింకు చొక్కా వాళ్ళకే బిసి బంధు,దళిత బంధు ఇచ్చారని ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ద్వారా అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి మంత్రులు శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో శ్రవణ్ నాయక్,కాంరెడ్డి రాంరెడ్డి,స్వామి గౌడ్,దన్న సింగ్,ఆర్ష మల్లేశం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య,దండి రవీందర్,కీర్తి కుమార్,పెద్దిగారి తిరుపతి,మామిడి సత్యనారాయణ రెడ్డి,అనిల్ కుమార్,హనీఫ్,సాయిరాం,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.