calender_icon.png 12 January, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టెరిలైజేషన్‌తో ఆపలేం

19-07-2024 12:40:23 AM

కుక్కల దాడులపై నిపుణుల సూచనలతో రండి

వాటిని పరిశీలించి ఆదేశాలిస్తాం: హైకోర్టు 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): వీధి కుక్కల దాడుల నియంత్రణకు సంబంధించి నిపుణుల మార్గదర్శకాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుక్కల దాడుల నివారణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని ఆదేశించింది. ఇందులో కోర్టులకు అవగాహన ఉండదని, నిపుణుల కమిటీ సూచనలు తీసుకుని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలతో వస్తే వాటి ఆధారంగా తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవని వ్యాఖ్యా నించింది. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, కుక్క కాటు బాధితులు దీన్ని ఆశ్రయిస్తారని పేర్కొంది. వీధికుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్ చేయడంలేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య దాఖలు చేసిన వ్యాజ్యంతోపాటు గత ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించి చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమమ్ త్రిపాఠి వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో వదిలిపెట్టాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో 3.79 లక్షల దాకా కుక్కలున్నట్లు తెలిపారు. జంతు సంక్షేమ సంఘాలతో కూడా చర్చలు జరిపి కుక్కల దాడుల నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలని చర్చిస్తున్నట్లు తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం కుక్కల దాడులు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయో పరిశీలించాలని, ఆ ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. కుక్కల దాడిలో చిన్నారి చనిపోయినట్లు పత్రికలో నిన్న కూడా కథనం వచ్చిందని, వీటి నివారణకు నిపుణులతో చర్చించి తగిన పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.