రైతుల జోలికొచ్చిన ప్రధాని మోదీనే యూటర్న్.. మీరెంత?
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక
- మానుకోటలో గిరిజన రైతుల ధర్నా
మహబూబాబాద్, నవంబర్ 25: రైతుల జోలికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే తట్టుకోలేదని.. సీఎం రేవంత్‌రెడ్డి ఎంత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గిరిజ నుల భూముల విషయంలో వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనల నేపథ్యంలో సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
హైదరాబాద్ నుంచి వందల వాహ నాల్లో కేటీఆర్ కాన్వాయ్ మానుకోటకు చేరుకున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మానుకోట గడ్డపై అడుగు పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు ఇక్కడి ప్రజలు రాళ్లతో సమాధానం ఇచ్చారని, ఇప్పుడు రైతుల భూములపై పడుతున్న ప్రభుత్వంపైనా అదే జరుగుతుందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ఎలా నీరుగార్చాలో, బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలోనని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం భూములు గుంజుకొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నించడంతోనే గిరిజన రైతులు ఎదురు తిరిగారని చెప్పారు.
గత తొమ్మిది నెలల కాలంలో గ్రామస్థులు ఎన్ని ఆందోళనలు చేసినా సీఎం ఒక్కసారి కూడా వెళ్లి మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో రైతుల జోలికి వచ్చి ప్రధానమంత్రి నల్ల చట్టాలను తీసుకొచ్చారని.. రైతుల నిరసనను తట్టుకోలేక తిరిగి వెనక్కి తీసుకు న్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా రైతుల జోలికి వస్తున్నాడని.. రాష్ట్ర ప్రజలు ఆయనకూ బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఢిల్లీకి 28 సార్లు వెళ్లారని.. కనీసం 28 రూపాయలు కూడా తీసుకురాలేదని ఎద్దేవాచేశారు. ఏదైనా కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పుడల్లా సీఎం ఢిల్లీ వెళ్లి కాలయాపన చేస్తు న్నారని విమర్శించారు. గతంలో మానుకోట రాళ్ల దాడి నుంచి నిప్పు పుట్టిందని.. ఆ నిప్పు నుంచే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. లగచర్లలో జరిగిందే రేపు రాష్ట్రంలో ఎక్కడైనా జరగొచ్చని చెప్పారు.
లగచర్లలో తొమ్మిది నెలలుగా దళిత గిరిజన రైతులు ఆందోళన చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కనీసం రైతులతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. తాను మహబూ బాబా ద్‌కు వస్తే రాళ్లతో కొట్టిస్తానని రేవంత్ అం టున్నారని.. ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైన్యం అని, మానుకోట రాళ్లు కూడా కేసీఆర్ గురించి చెప్తాయని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటును ఎదుర్కొం టున్నారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మహబూబాబాద్‌లోనే కాదు ఇక నుంచి రైతుల కోసం రాష్ట్రమంతా ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. ముం దుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. తమ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.
నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదు: మాజీ ఎంపీ కవిత
నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ ఉండదని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ రైతులు మర్చిపోరని, మళ్లీ సీఎంగా చేస్తారని స్పష్టంచేశారు.
లగచర్లనే కాదు రాష్ట్రంలో ఎక్కడ రైతులు నిరసన వ్యక్తం చేసిన వారికి మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చిందని మురిసిపోతున్నారని.. దానిని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలను అక్కడి ప్రజలు పట్టించుకోలేదని ఎద్దేవాచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నాయకులు ఎనుగుల రాకేష్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.