calender_icon.png 29 September, 2024 | 5:49 AM

సర్కార్ కాంటాలకు పెసర్లు అమ్ముతలేరు!

29-09-2024 01:19:58 AM

  1. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఆదరణ కరువు
  2. ప్రైవేట్ వ్యాపారులవైపే అన్నదాతల మొగ్గు
  3. నెలరోజులుగా సేకరించింది 500 మెట్రిక్ టన్నులే
  4. మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని రైతుల డిమాండ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రాలకు ఆదరణ కరువైంది. మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు అధిక మొత్తంలో చెల్లించడం, పంట అమ్మిన రెండు రోజులకే డబ్బులు చెల్లిస్తుండంతో రైతులు దళారులకే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.

రైతులకు మార్కెట్ సమస్యలు తలెత్తకుండా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ యాసంగిలో రైతులు 64,175 ఎకరాల్లో పెసర సాగు చేశారు. కాగా 17,841 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు చివరి వారంలో మార్క్‌ఫెడ్ రాష్ట్రంలోని ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 12 ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.

క్వింటాల్‌కు రూ.8682 మద్దతు ధర చెల్లించి  కొనుగోలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 500 మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించారు. గతేడాదిలో 61 వేల ఎకరాల్లో పంట సాగు చేయగా, ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు. దీంతో ఎక్కువ మొత్తంలో పెసర్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు భావించారు.

కానీ వారి అంచనాలు తారుమార య్యాయి. ఇప్పటివరకు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని రైతులు మాత్రమే కేంద్రాల్లో అమ్మకాలు చేసినట్లు తెలిపారు. మిగతా జిల్లాలో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేవని అధికారులు చెబుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఏటా పెసర్ల కొనుగోలు అధికంగా జరగగా, ఈసారి రైతులు కొనుగోలు కేంద్రాల వైపు తొంగి చూడలేదు.

మద్దతు రూ.10 వేలకు పెంచితేనే..

రాష్ట్ర ప్రభుత్వం వరి, పత్తి పంటల కొనుగోళ్లపై దృష్టి సారించి, చిరుధాన్యాల రైతు లను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర, రాయితీలు, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ జరగడం లేదని దీంతో తాము స్థానిక వ్యాపారుల వద్ద అప్పులు తీసుకొని పంట సాగు చేస్తున్నామని తెలిపారు. సాగు సమయంలో పెట్టుబడి సాయం లభించక తప్పనిసరి వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. రేవంత్ సర్కార్ పెట్టుబడి కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తుందని ఆశపడితే ఇప్పటివరకు రైతుభరోసా ఊసేలేదని మండిపడుతున్నారు.

ఆశించిన ధర రాక..

ప్రభుత్వం పంటకు ఆశించిన ధర కల్పించకపోవడంతో రైతులంతా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.10,500 వరకు వస్తుండడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచా రం జరుగుతుంది. దీంతో పాటు తూకం వేసిన రెండో రోజు నగదు ఇవ్వడంతో అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు సెంట ర్ల వద్దకు రావడం లేదని తెలిసింది. దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో పెసర్లు తడిసిపోతాయనే భయంతో పాటు మద్ద తు ధరలో కోత పెడతారనే భావనతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.