calender_icon.png 18 November, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీని అడ్డుకోలేరు

18-11-2024 02:00:18 AM

బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటై కుట్రలు

  1. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫొటో ఫోజుల కోసం మూసీ నిద్ర
  2. మూడు నెలల పాటు ఇద్దరం అక్కడే నిద్రచేద్దాం
  3. కిషన్‌రెడ్డికి  పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సవాల్ 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టును అడ్డుకునేం దుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటై కుట్ర చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీప్ మహేశ్ గౌడ్ విమర్శించారు. మూసీ ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోలేరని ఆయన చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారన్నారు.

బస చేసేముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారని ఆరోపించారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని, మూసీ  పక్కన మూడు నెలలు బస చేయాలని సీఎం రేవంత్  సవాల్‌ను స్వీకరించాలన్నారు. తాను కూడా వస్తానని, ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దామని పేర్కొన్నారు.

అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని, బీఆర్‌ఎస్ బలం తగ్గిన ప్రతిసారి కిషన్‌రెడ్డి బయటకి వచ్చి బీఆర్‌ఎస్ పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఒక్కరోజు నిద్రచేసి ఏం సాధించారని, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడటం మానుకోవాలని హితువు పలికారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌కు ఒక న్యాయం, మూసీ రివర్‌కు ఒక న్యాయమా అంటూ నిలదీశారు.

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటామని, వారి పిల్లలకు విద్య అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గుజరాత్ గులాంలా ఎందుకు వ్యవహరిస్తున్నారని, ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుంది అనగానే వారికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముందు గుజరాత్ ఎక్కడ  వెనక పడుతుందోనన్న భయం బీజేపీని వెంటాడుతుందన్నారు.

ప్రళయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారని, ఒక్కరోజు నిద్రతో అక్కడి ప్రజల అవస్థలు ఏం తెలుసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టాలో లేదో తెలుస్తుందని, ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే భాధ్యత మా ప్రభుత్వదేనన్నారు. 

తెలంగాణ రైజింగ్‌గా ముందుకు వెళ్లుతుందని, మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు. కిషన్ రెడ్డి కాళ్ళకు సాక్సులు వేసుకొని నిద్రపోయారని, అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం సహకరించుకుంటాయని ఆరోపించారు.

తెలంగాణ మాది బుల్డోజర్ పాలన కాదని, యూపీలో యోగి అధిత్యనాథ్‌ది బుల్డోజర్ పాలన అంటూ విమర్శించారు. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడనేది స్పష్టమైందన్నారు. అందుకే పక్కదారి పట్టించే రాజకీయాలు చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ బస చేశారని విమర్శించారు. తాము మూసీ ఒడ్డున రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు అక్కడ ప్లాట్ కొనుక్కుంటావా కిషన్‌రెడ్డి.. అంటూ ఎద్దేవా చేశారు.