calender_icon.png 27 October, 2024 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ కోర్సులు ఇష్టపడుతలేరు.. భారీగా భర్తీకాని సీట్లు

10-08-2024 01:02:48 AM

సంప్రదాయ కోర్సులపై అనాసస్తి !

సీఎస్‌ఈ అనుబంధ కోర్సుల వైపు విద్యార్థుల మొగ్గు

‘బీటెక్’లో సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులకు తగ్గిన డిమాండ్ 

నాలుగేళ్లలో భర్తీ కానీ సీట్లు 1.18 లక్షలు

నిర్మాణ, ఇరిగేషన్, హెవీ ఇండస్ట్రీస్, డిఫెన్స్, పవర్ రంగాలపై ప్రభావం 

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సు లకు ఏటికేడు డిమాండ్ తగ్గుతోంది. విద్యార్థులు అధునాతన కోర్సుల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సివిల్, మెకానికల్, ఈఈఈ తదితర కోర్సుల్లో ఏటా వేలాది సీట్లు భర్తీ కావడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే సీఎస్‌ఈ అనుబంధ కోర్సులు ఎంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. కోర్సు పూర్తి కాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్ లభించే కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు సైతం డిమాండ్‌లేని కోర్సులకు స్వస్తి పలికి, సీఎస్‌ఈ, ఐటీ అనుంబంధ కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. అయినప్పటికీ ఆశించిన మేర సీట్లు నిండడం లేదు.

సీట్లు భర్తీ కాని కోర్సులపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆ కోర్సుల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల కన్వర్షన్‌కు అనుమతులు ఇవ్వలేదు. సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో సీట్లు మిగులుతుండడంతో యాజమాన్యాలు ఆ సీట్లను సీఎస్‌ఈకు మార్చుకోవాలని భావిస్తున్నాయి. సంప్రదాయ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ప్రస్తుతం 27.54శాతానికి పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నిర్మాణ రంగం, ఇరిగేషన్, హెవీ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్, డిఫెన్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమ్బుల్ రంగాలు మ్యాన్ పవర్ కష్టాలు ఎదుర్కొనే ప్రభావం ఉన్నది.

సివిల్ ఇంజినీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఆయా  కంపెనీలకు దొరకడం దుర్లభమవుతుంది. ఇలాంటి సందర్భంలో సర్కార్ అప్రమత్తమైంది. గత విద్యాసంవత్సరంలో మొత్తం 1,17,426 సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా, సుమారు 20 వేల సీట్ల వరకు కన్వర్షన్‌కు అనుమతుల కోసం యాజమాన్యాలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాయి. వాటికి సీఎం రేవంత్‌రెడ్డి అనుమతులను నిరాకరించారు. మరోవైపు భవిష్యత్తులో సీఎస్‌ఈకి డిమాండ్ తగ్గి మళ్లీ సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులు పూర్తి చేసిన వారికి డిమాండ్ పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నాలుగేళ్లలో భర్తీ ఇలా.

ఏటా ఇంజినీరింగ్ సీట్ల కౌన్సెలింగ్‌ను మూడు విడుతల్లో జరుగుతోంది. 2020 రాష్ట్రవ్యాప్తంగా 180 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, తర్వాతి విద్యాసంవత్సరం కాలేజీల సంఖ్య 175 చేరుకోగా, ఈ విద్యాసంవత్సరం కూడా అదే సంఖ్య కొనసాగుతోంది. 2020 నుంచి 2023 వరకు అన్ని కళాశాలలు కలిపి మొత్తం 1,18,131 సీట్లు మిగలడం గమనార్హం. ఈ విద్యాసంవత్సం (2024 175 కళాశాలల పరిధిలో మొత్తం 1,12,069 సీట్లు భర్తీ చేయాల్సి ఉన్నది. ఎప్‌సెట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండో విడత వరకు మొత్తం 86,509 కన్వీనర్ కోటా సీట్లకు 81,490 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయాయి. తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయితే ఈ విద్యాసంవత్సరం ఎన్ని సీట్లు మిగిలాయనే గణాంకాలపై స్పష్టత రానున్నది. 

నాలుగేళ్లలో భర్తీ అయిన సీట్ల వివరాలు

సంవత్సరం మొత్తం కాలేజీలు మొత్తం సీట్లు భర్తీ అయినవి మిగిలినవి

2020 180 98,988 65,720 33,268

2021 175 1,09,773 77,700 32,073

2022 175 1,08,715 82,350 26,365

2023 175 1,17,426 91,001 26,425