- ఆపై ఆయనపై అనుచిత వ్యాఖ్యలు
- ఫిరాయింపుల కేసులో ఏజీ వాదన
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి కనీస సమయం ఇవ్వకుండా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది.
పిరాయింపు పిటిషన్లపై నాలు గు వారాల్లో విచారణ షెడ్యూల్‌ను రూపొందించడాని తక్షణం స్పీకర్ ముందుంచాలని, ఆపైన నిర్ణయించిన షెడ్యూలును కోర్టుకు సమర్పించాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించారు.
సింగిల్ జడ్జి ఆదేశాలను జారీచేసే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు వేర్వేరుగా వేసిన రెండు అప్పీళ్లను మంగళవారం చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. కేశం మెగాచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రమే సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు మార్చి 18న పిటిషన్లు సమర్పించారని తెలిపారు.
అనంతరం మార్చి 30న అదనపు అఫిడవిట్ దాఖలు చేశారని, తరువాత 10 రోజులకే ఈ హైకోర్టును ఆశ్రయించారని తప్పుపట్టారు. స్పీకర్‌కు కనీస గడువు ఇవ్వకుండా పిటిషన్లు వేశారని, అంతేకాకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని అన్నారు.
స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదంటూ ఇదే హైకోర్టు ఎరబ్రెల్లి దయాక ర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌లో తేల్చి చెప్పిందన్నారు.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్ ఓ విధానం ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ అధికారాల్లో కోర్టుల జోక్యంపై పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు.
స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కోర్టులు న్యాయ సమీక్ష చేయరా దని, దీనికి సంబంధించి సుప్రీం తీర్పులను సింగిల్ జడ్జి పట్టించుకోలేదని అన్నారు. దానం నాగేందర్ తరఫు సీనియర్ లాయర్ జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అని, స్పీకర్ విధుల్లోకి కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం వెలువరించాకే న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందన్నారు. వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.