ధాన్యం అమ్మేసి.. ఆస్తుల బదిలీ
- కేసులు నమోదైనా తప్పించుకునేందుకు సీఎంఆర్ ఎగవేసిన మిల్లర్ల ప్లాన్
- సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే నాలుగు మిల్లులపై కేసులు
- వీటి ఆస్తులు సగం వరకు మాయం.. అదే దారిలో మరో మూడు మిల్లులు
* గత ఏప్రిల్‌లో జిల్లాలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా తిరుమలగిరిలోని సంతోషి రైస్ మిల్లులో రూ. 71 కోట్ల సీఎంఆర్ ధాన్యం, నాగారంలోని రఘురామ మిల్లులో రూ. 19 కోట్ల ధాన్యం, కోదాడలోని శ్రీ వెంకటేశ్వర మిల్లులో రూ. 64 కోట్ల సీఎంఆర్ ధాన్యం నిల్వల అడ్రస్ లేదని అధికారులు గుర్తించారు. ఆ మిల్లుల యాజమానులపై కేసు నమోదు చేశారు. సంతోషి రైస్ ఇండ్రస్టీ, రఘురామ మిల్లులకు ఒక్కరే యాజమాని కాగా, ఈ మిల్లుల ఆస్తులను గతంలోనే సగం మేరకు ఇతరుల పేరున బదులాయించినట్లు సమాచారం. ఇక శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ గతంలోనే ఇతరులకు అమ్మినా.. పాత యాజమాని పేరునే మిల్లును కొనసాగిస్తున్నారు.
* సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని ఓ మిల్లు యాజమాని మిల్లులో ఉన్న ధాన్యాన్ని మొత్తంగా అమ్ముకొన్నాడు. మిల్లులో ఉన్న మిషనరీ, ఫర్నీచర్ కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా జిల్లా సివిల్ సప్లయ్ అధికారుల చెవినపడింది. తేరుకున్న అధికారులు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. అప్పటికే మిల్లులో ధాన్యం నిలువలు నిండుకున్నాయి. ఈ మిల్లరు సుమారు రూ. 32 కోట్ల ధాన్యం ప్రభుత్వానికి బకాయి పడ్డాడు. మిల్లు యాజమాని, వారి కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులు సగంవరకు ఇతరుల పేరున మారినట్లు సమాచారం. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. కానీ ఆ మిల్లరు బకాయి ఉన్న సొమ్మును ప్రభుత్వం ఎలా రాబడుతుందనేది ప్రశ్నగానే మిగులుతోంది. ఇది ఎంకేఆర్ మిల్లు కథ.
సూర్యాపేట, జూలై 18 (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని సంతోషిమాత మిల్లుకు 2022 ఖరీప్ సీజన్‌లో 16,986 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా ఇందుకు 11,380 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటివరకు 8,748 మెట్రిక్ రైస్ డెలివరీ చేయగా 2,632 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి ఉన్నది. అదేవిధంగా 2023 ఖరీఫ్ సీజన్‌లో 9,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపు జరుగగా ఇందుకు 6,333 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉంటే కేవలం 260 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చింది. ఇంకా 6,073 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి ఉంది. మొత్తం 8,705 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉన్నది. ఈ మిల్లు వద్ద పెండింగ్ సీఎంఆర్ విలువ సుమారు రూ.29 కోట్లు.
అదేవిధంగా హుజూర్‌నగర్‌లోని తిరుమల మిల్లుకు 2022 ఖరీఫ్ సీజన్‌లో 13,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా ఇందుకు 9,294 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటివరకు 2,199 మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ చెయగా 7,095 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి ఉంది. అదే విధంగా 2023 ఖరీఫ్ సీజన్‌లో 8,110 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపు జరుగగా ఇందుకు 5,433 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉంటే కేవలం 144 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించింది. ఇంకా 5,289 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి ఉంది. మొత్తం 10,722 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ సీఎంఆర్ విలువ సుమారు రూ.36 కోట్లు. కాగా సంతోషిమాత, తిరుమల మిల్లుల యాజమాని ఒక్కరేనని, ఇతురుల పేరున అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు మిల్లులో సుమారు రూ.68 కోట్ల సీఎంఆర్ పెండింగ్ ఉన్నది. త్వరలోనే ఈ మిల్లు యాజమాని చేతులు ఎత్తివేసే అవకాశం ఉన్నదని సమాచారం.
తిరుమలగిరిలోని ఏఎస్‌ఆర్ మిల్లుకు 2023 ఖరీఫ్ సీజన్‌లో 10,524 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపు జరుగగా ఇందుకు 7,051మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉంటే 2,172 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించింది. ఇంకా 4,879 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి ఉన్నది. ఈ మిల్లులో రూ. 10 కోట్ల సిఎంఆర్ పెండింగ్ ఉన్నది. ఇతను కొంత మేర ధాన్యం అమ్ముకొని అమ్మిన ధాన్యం 2022 రబీ టెండర్ ధాన్యం చూపించాడు. ఇందుకు టెండర్‌దారులకు కొంత డబ్బులు చెల్లించి ప్రస్తుతం అధికారులను మభ్యపెట్టారని, త్వరలోనే ఉడాయించే అవకాశం ఉందని కొందరు మిల్లుర్లు అంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ధాన్యం మరాడించి ఇవ్వడంలో భారీ కుంభకోణం జరుగుతున్నది. ధాన్యం తీసుకున్న కొందరు మిల్లర్లు సీఎంఆర్ పెట్టడంలో మొండికేస్తున్నారు. ఇప్పటికే గత మూడు సీజన్‌లకు సంబంధించి కోట్లాది రూపాయల ధాన్యం పలువులు మిల్లర్ల వద్ద ఉండగా అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న మిల్లర్లు భారీ దోపిడికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ రికవరీ యాక్ట్‌లో లొసుగులను అడ్డుపెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగవేతకు సిద్ధం అవుతున్నట్లు పలువులు మిల్లర్లే చెబుతున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం అమ్ముకోవడంతోపాటు, మిల్లు యాజమాని, కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులను ఇతరుల పేరున బదలాయిస్తున్నారు.
ఇప్పటికే నాలుగు మిల్లులపై కేసు
సూర్యాపేట జిల్లాలో 2022 ఖరీఫ్, 2022 రబీ, 2023 ఖరీఫ్ సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడంలో వెనుకబడిన నాలుగు మిల్లులో జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించగా వాటిలో ధాన్యం నిలువలు లేవని గుర్తించారు. తిరుమలగిరిలోని సంతోషి, నాగారంలోని రఘురామ, కోదాడలోని వెంకటేశ్వర, గడ్డిపల్లిలోని ఎంకేఆర్ మిల్లులపై కేసులు నమోదు చేశారు. అయితే సీఎంఆర్ ప్రస్తుతానికి సకాలంలో పెడుతున్న మిల్లుల్లో మాత్రం అధికారులు తనిఖీ చేయడం లేదు. కాని ఈ మిల్లులో కూడా ఉండవల్సిన స్థాయిలో ధాన్యం నిల్వలు లేవనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతానికి కాలం గడుపుతున్నా ఏదో ఒక రోజు వారు కూడా సీఎంఆర్ ఇవ్వకుండా చేతులు ఎత్తేయడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు కండ్లు తెరిచి అన్ని మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాలని, కేసులు నమోదైన మిల్లులు, సీఎంఆర్ పెండింగ్ మిల్లుల ఆస్తులను జప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మరో మూడు మిల్లులు ఇదే దారిలో
జిల్లాలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న జాబితా మొదటి వరుసలో ఉన్న మిల్లులో ఇప్పటికే నాలుగు మిల్లులపై కేసులు నమోదైనాయి. ఇదే దారిలో మరి కొన్ని మిల్లులు ఉండగా ముఖ్యంగా మూడు మిల్లులపై కేసులు తప్పవని అర్థమవుతోంది. ఇందులో గడిపల్లిలో ఉన్న సంతోషిమాత, హుజూర్‌నగర్‌లోని తిరుమల, తిరుమలగిరిలోని ఏఎస్‌ఆర్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులు గత మూడు సీజన్‌లకు సంబంధించి కోట్లలో సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి.
వందలాది కోట్ల ధాన్యం మిల్లుల వద్దే..
సూర్యాపేట జిల్లాలో గత మూడు సీజన్‌లకు సంబంధించిన ధాన్యం మిల్లుల వద్ద పెండింగ్‌లో ఉన్నది. గత మూడు సీజన్‌ల నుంచి 72 మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. ప్రతి మిల్లరు సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల పైనే విలువ చేసే ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ కోసం తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వం విధిస్తున్న గడువులోపు సుమారు 12 మిల్లులు సీఎంఆర్ అందించకుండా మొండికేస్తూ వస్తున్నాయి. కొన్ని మిల్లులు సీఎంఆర్ క్రమంగా పెడుతున్న భారీగా బకాయిలు ఉన్నాయి. ఈ మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని గత నెల రోజుల నుంచి బయటకు అమ్ముకుంటున్నట్లు సమాచారం.