calender_icon.png 17 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్కడ తేలేదాకా నిర్ణయం తీసుకోరా?

06-08-2024 01:26:19 AM

ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులకు చెందిన పిటిషన్లు ఇక్కడ తేలేదాకా స్పీకర్ వద్ద ఉన్న పిటిషన్లపై నిర్ణయం తీసుకోరా? అంటూ హైకోర్టు న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌బ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందలు, భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా? అని ప్రశ్నించారు. మరో మూడు నెలలు ఈ పిటిషన్లపై తాము నిర్ణయం వెలువరించని పక్షంలో స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోరా అనగా ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రాజ్యాంగపరమైన అంశాలను కోర్టులు దాటవేయలేవని అన్నారు. తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయజాలదన్నారు.

ట్రైబ్యునల్‌గా స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాల్సిందేననే చెప్పారు. స్పీకర్‌కు కోర్టులు గడువు నిర్దేశించజాలవని అన్నారు. పిటిషనర్లు అక్కడ ఫిర్యాదు చేసి తగిన గడువు ఇవ్వకుండానే కోర్టును ఆశ్రయించారని చెప్పారు. పిటిషనర్లు స్పీకర్‌పై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు.  పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ పిటిషన్లను తీసుకోవడానికే స్పీకర్ కార్యాలయం నిరాకరించిందని, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తరువాత తీసుకుందని చెప్పారు.

నెల రోజుల తరువాత కోర్టును ఆశ్రంచియినట్టు గుర్తుచేశారు. ట్రైబ్యునల్‌గా స్పీకర్ నిర్దిష్ట గడువులోగా పిటిషన్లను తేల్చాల్సి ఉందన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. వీటిపై మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.