calender_icon.png 26 November, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనను చూసి ఓర్వలేకపోతున్రు

24-09-2024 02:41:05 AM

  1. గాంధీ ఆసుపత్రిపై కేటీఆర్ ఏ హోదాతో కమిటీ వేశారు 
  2. ఆయన ఇంకా మంత్రిగానే ఫీలవుతుండటం దురదృష్టకరం
  3. బీఆర్‌ఎస్‌పై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఫైర్   

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఏ అర్హతతో గాంధీ ఆసుపత్రిపైన బీఆర్‌ఎస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలతో కమిటీ వేసిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. పేదల హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన గాంధీపై కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ఇంకా మంత్రిగానే ఫీల్ అవుతున్నారని, వీరి పనికి మాలిన చేష్టలతో గాంధీ ఆసుపత్రి సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో అయిలయ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పాలనను చూసి బిల్లా, రంగాలు ఓర్వలక తప్పుడు ప్రచారాలకు ఒడిగట్టారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఛీ కొట్టినా వాళ్లకింకా బుద్ధి రాలేదన్నారు. హరీశ్‌రావు మాట మీద నిలబడే వ్యక్తి అయితే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. కేటీఆర్ కూడా కొత్తగా రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను ఎలుకలు కరిచిన విషయం మర్చిపోయారా అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికే కమిటీల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను బర్తరఫ్‌ను చేసి, కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు అతడినే ముందుపెట్టి కేటీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఏనాడు పట్టించుకున్నపాపన పోలేదన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం కేటీఆర్, హరీశ్‌రావు పోటీ పడి మాట్లాడుతున్నారని, డ్రామారావు.. డ్రామాలు మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం విజయడెయిరీని నిర్వీర్యం చేసిందని, పాల రైతులకు రూ.100 కోట్ల బోనస్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టారని ఆరోపించారు.