calender_icon.png 26 October, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బఫర్ జోన్లను నోటిఫై చేయలేరా?

23-07-2024 01:43:41 AM

ఏడాది అయినా ఎందుకు చేయలేదు?

హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులకు బఫర్ జోన్లను గుర్తించేందుకు ఇంకెంత సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాది గడువు ఇచ్చినా ఇప్పటివరకు బఫర్ జోన్లను ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయాలని చెరువుల రక్షణ కమిటీ (లేక్ ప్రొటెక్షన్ కమిటీ)కి 2023 జూలైలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై వివరించేందుకు హెచ్‌ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ నెల 24న జరిగే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై గత ఏడాది ఉత్తర్వులు ఎందుకు అమలు కాలేదో వివరణ ఇవ్వాలని సూచించింది. చెరువులో అక్రమణలపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై కౌంటర్ వేయాలని ఆదేశించింది. రామన్నకుంట చెరువు ఎన్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అక్రమ నిర్మాణలు చేస్తున్నా చర్యలు తీసుకోవటం లేదని హ్యూమన్ రైట్స్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ వేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జే అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వుల అమలు వివరాలు ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో హైకోర్టు పైవిధంగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను ఆదేశించింది.