calender_icon.png 6 March, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

06-03-2025 12:00:00 AM

 సెప్టిక్ ట్యాంకులలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న డీటీఎఫ్ టీం

పటాన్ చెరు, మార్చి 5 : ఎవరికి అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంకులో 205 కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా డీటీఎఫ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.02 కోట్లు ఉంటుంది. కేసుకు  సంబంధించిన వివరాలను పటాన్ చెరు ఎక్సైజ్ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో డీటీఎఫ్ పోలీసులు  వెల్లడించారు.

మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన దీపక్ నాగనాథ్ గోయింగ్ అనే వ్యక్తి ఏఓబి చిత్రకొండ ప్రాంతం నుంచి  నారాయణఖేడ్ ప్రాంతవాసి బీమ్ సింగ్ మధు తో కలిసి సెప్టిక్ ట్యాంకులో గంజాయిని తరలించడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు.  అనుమానం రాకుండా గంజాయి పై  చెత్త, ప్లాస్టిక్ కవర్లు కప్పేశారు.

భద్రాచలం,  సూర్యాపేట, మరిపేట, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల నుంచి పటాన్ చెరు సమీపంలోని కొల్లూరు మీదుగా వెళ్తుండగా డీటీఎఫ్ సిఐ దుబ్బాక శంకర్ బృందం  పథకం ప్రకారం పట్టుకొన్నారు. సెప్టిక్ ట్యాంకులోని గంజాయిని బయటకు తీసి తూకం వేయగా 205 కిలోలుగా ఉన్నట్లు పటాన్ చెరు ఎక్సైజ్ సూపరిండెంట్  నవీన్ చంద్ర తెలిపారు.

గంజాయి విలువ కోటి రెండు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సెప్టిక్ ట్యాంక్‌ను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. డిటిఎఫ్ బృందంలో సిఐ దుబ్బాక శంకర్ తో పాటు ఎస్‌ఐలు సతీష్, శ్రీనివాస్ రెడ్డి, హనుమంతు, కానిస్టేబుల్ అంజిరెడ్డి, అరుణ, జ్యోతి, ప్రభాకర్ శివకాంత్  ఉన్నారు.