calender_icon.png 18 October, 2024 | 10:01 AM

గంజాయి విక్రేతల అరెస్ట్

18-10-2024 12:36:44 AM

అరెస్టయిన నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు 

కూకట్‌పల్లి, అక్టోబర్ 17: గంజాయి విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోరాటి రాజేశ్, తంగేళ్ల రమేశ్, నక్కా నాగవంశీ, పల్నాడు జిల్లాకు చెందిన జంపని సాయిగోపి విహారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు.

నలుగురు ఒక ముఠాగా ఏర్పడి ప్రతిరోజు మధ్యాహ్నం కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని పార్క్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు గురువారం వారిని పట్టుకొని ఎండు గంజాయి ప్యాకెట్లు 1300 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

40 కిలోల గంజాయి పట్టివేత..

సంగారెడ్డి: గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూర్ రూపేష్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 

గురువారం ఉదయం మనూర్ మండలంలోని డోవూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నాగిలగిద్ద వైపు నుంచి నారాయణఖేడ్ వైపు వస్తున్న ఓ కారును తనిఖీ చేయగా, డిక్కీలో 40 కిలోల గంజాయి లభించిందన్నారు. డ్రైవర్‌ను కర్ణాటకకు చెందిన మల్లగొండగా గుర్తించినట్లు తెలిపారు. రాహుల్ చక్రవర్తి, మల్లేశ్ జాదవ్, దాదా పాటిల్ అనే వ్యక్తులతో కలిసి గంజాయి రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. వారు ముగ్గురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

హాష్ ఆయిల్  విక్రేతల అరెస్ట్

అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీరంగూడ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ముగ్గురు వ్యక్తులు హాష్ ఆయిల్  విక్రయిస్తున్నారనే  సమాచారంతో అమీన్‌పూర్ ఎస్సై విజయ్‌రావ్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. అఖిలేష్, ప్రేమ్, సాయిశివ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు.