calender_icon.png 15 March, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐస్‌క్రీమ్‌లో గంజాయి

15-03-2025 12:22:43 AM

  1. హోలీ వేడుకల వేళ కలకలం
  2. హైదరాబాద్ ధూల్‌పేట్‌లో మరోరకం దందా..
  3. కుల్ఫీ, బర్ఫీ, స్వీట్లలో కలిపి విక్రయం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14(విజయక్రాంతి): అందరూ హోలీ వేడుకల్లో మునిగిఉన్న వేళ ధూల్‌పేట్‌లో గంజాయి కలకలం రేగింది. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిరంతరం పనిచేస్తున్నా.. అక్రమార్కులు సమయం చూసి తమ బుద్ధిని చూపెడుతున్నారు.

అంతటా హోలీ వేడుకలు జరుగుతుండగా.. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పరిధిలోని మచిలీపుర,బలరాంగల్లీ, బేగంబజార్‌లో కుల్ఫీ, బర్ఫీ, స్వీట్‌లో గంజాయి కలిపి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. హోలీ వేడుకల ముసుగులో యథేచ్ఛగా గంజాయి కలిపిన కుల్ఫీ, బర్ఫీ, స్వీట్‌లను తయారుచేసి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు గుర్తించారు.

ధూల్‌పేట్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్,  ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఏ టీంలీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ వేళ అక్రమార్కులు ఐస్‌క్రీం, బర్ఫీ, స్వీట్‌లలో గంజా యి కలిపి వినియోగదారులకు విక్రయించే అవకాశం ఉందని  ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులు నిఘా ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.

మచిలీపురలో సత్యనారాయణసింగ్ అనే వ్యక్తి ఇంట్లో కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి వేసి తయారుచేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్న100 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బాక్సు 200 ఉంది.  సత్యనారాయణసింగ్‌ను అదుపులోకి తీసుకు న్నారు.

బలరాంగల్లీలో బల్దేవ్‌సింగ్ అనే వ్యక్తి వద్ద 72బర్ఫీ గోలీల బాక్స్‌లు దాదాపు 200గ్రాములు, బేగంబజార్‌కు చెందిన టీ గంగాధర్ అనే వ్యక్తి వద్ద బంగ్ పేరిట  5గ్రాముల చొప్పున తయారు చేసి విక్రయిస్తున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఎస్టీఎఫ్ టీంను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అభినందించారు. 

రెగ్యులర్‌గా ఐస్‌క్రీం.. పండగ వేళలో గంజాయి కుల్ఫీ, స్వీట్

ధూల్‌పేట్‌లో రెగ్యులర్‌గా కుల్ఫీ, ఐస్‌క్రీం విక్రయిస్తూ జీవనం సాగించేవారున్నారు.  కానీ వారిలో కొంతమంది శివరాత్రి, హోలీ సందర్భంగా గంజాయితో  కుల్ఫీ, స్వీట్, బర్ఫీలను తయారుచేసి విక్రయించే అవకాశం ఉన్నట్లు గుర్తించి వారిపై నిఘా పెట్టామని  ఎక్సైజ్ పోలీసులు చెప్పారు.

దీంతో పండగపూట పోలీసులు, ఎక్సైజ్ నిఘా ఉండకపోవచ్చనే ఉద్దేశ్యంతో, సొమ్ముచేసుకోవచ్చనే ఆశతో వీటిని తయారుచేసి నట్లు గుర్తించామన్నారు. ఎలాంటి సంఘటనలు జరగొద్దని మద్యం విక్రయాలనే నిలిపివేశామని, గంజాయి విక్రయం, వినియోగం జరిగితే సహించేది లేదని హెచ్చరిం చారు.

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏడు నెలలుగా తాము చేపట్టిన ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ తో గంజాయి విక్రయాలు భారీగా తగ్గాయని, 95శాతం మంది దందాను ఆపి వివిధ పనులు చేసుకుంటున్నారన్నారు. ధూల్‌పేట్‌లో గంజాయి విక్రయం జరిగే అవకాశం లేదని ఇక్కడకు వచ్చే వినియోగదారులైనా, విక్రయదారులైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.