calender_icon.png 16 November, 2024 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండోపాయం

13-11-2024 12:00:00 AM





తీక్ష ్ణ దండోహి భూతానాముద్వేజనీయః 

మృదుదండః పరిభూయతే 

యథార్హ దండః పూజ్యః 

సువిజ్ఞాత ప్రణీతో హి దండః ప్రజాః 

ధర్మార్థకామోర్యోజయతి.

 కౌటిలీయం -(1

“నాయకుడు దండనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదు. తీక్ష ్ణంగా శిక్షించేవాడు ప్రజలకు ఉద్వేగం, భయంతో కూడిన ద్వేషానికి కారణమవుతాడు, మృదువుగా దండించే వాడు ప్రజలకు లోకువ అవుతాడు. ఎంత అవసరమో అంత దండ ప్రయోగం చేసేవాడు ప్రజలతో పూజలు అందుకుంటాడు. దండన లక్షణాన్ని తెలుసుకొని దానిని ప్రయోగించే వాడి నాయకత్వం ప్రజలకు ధర్మార్థకామాలను అందచేస్తుంది. ఈ ప్రక్రియలో దుర్బలుడు కూడా సమర్థుడు అవుతాడు.

అంతేకాదు.. ‘అప్రణీతో హి మాత్స్య న్యాయముద్భావయతి, బలీయానబలం హి గ్రసతే ..’ అసలే దండనను ఉపయోగించని నాయకుని నాయకత్వంలో మత్స్యన్యాయం చెల్లుబాటవుతుంది. అంటే.. చిన్న చేపను పెద్ద చేప మింగేసినట్లుగా ఎక్కువ శక్తి కలిగిన వాడు బలహీనుడిని మ్రింగి వేస్తాడు” అంటాడు ఆచార్య చాణక్య.

సాధారణంగా సంస్థలలో ముఖ్య కార్యనిర్వహణాధికారియే కీలకమైన వ్యక్తి. సంస్థ సంస్కృతిని కాపాడడం, క్రమశిక్షణను నెలకొల్పడం, లక్ష్యాలను అధిగమించడం నాయకుని సమర్థతకు పరీక్షగా చెప్పుకోవాలి. వివిధ మనస్తత్వాలతో కూడిన ఉద్యోగులను అర్థం చేసుకోవడం, వారిని ఆవసరానుగుణమైన బృందాలుగా ఏర్పరచి సమన్వయం చేయడం, పని ప్రదేశాలలో వారి సమస్యలను తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడం, వివిధ బృందాల మధ్య, వ్యక్తుల మధ్య అవగాహనా లోపాలను సరైన సమయంలో సరిచేయడం.. వంటివన్నీ నాయకుని ప్రతిభా వ్యుత్పత్తులకు, దక్షతకు గీటురాళ్ళుగా నిలుస్తాయి.

ఈ ప్రక్రియలో ఏ మాత్రం ప్రమత్తత చోటు చేసుకున్నా ఉత్పత్తి ఉత్పాదకతలు మందగించడమే కాక అమ్మకాలపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. 

సమర్థుల తప్పులకు ఎలాంటి శిక్ష?

సంస్థ నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తూ ఆశించిన ఫలితాలు సాధించాలన్నా, అమ్మకాల లక్ష్యాలను అధిగమించాలన్నా, ఉద్యోగుల భాగస్వామ్యం తప్పనిసరి. వారి నిబద్ధత, సమర్థతలే సంస్థకు ఊపిరులూదుతాయి. కాబట్టి, ఉద్యోగులతో ఆత్మీయంగా కలసి ఉండడం నాయకునికి తప్పనిసరి. అదే సమయంలో సంస్థలో క్రమశిక్షణ ఉండాలి. అలాగని సంస్థ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై దృష్టి చెదరిపోరాదు.  

ముఖ్యకార్య నిర్వహణాధికారి సంస్థలో ఉద్యోగులను శిక్షించడానికైనా, పదోన్నతులు కల్పించడానికైనా తగిన అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగని, తనకు అధికారం ఉంది కదా అని విచక్షణారహితంగా, శిక్షించినా లేదా పదోన్నతులను కల్పించినా ఆశించిన ఫలితాలను సాధించలేరు. మెతక వైఖరి ప్రదర్శిస్తే ఉద్యోగులు తలకెక్కి కూర్చుంటారు. ఉద్యోగిని శిక్షించాలనే భావనతో కాకుండా తప్పును సరిచేసే ఆలోచనా విధానంలో ఇచ్చే శిక్షలు సత్ఫలితాలను ఇస్తాయి.

శిక్షలైనా, ప్రశంసలైనా సంస్థ ఉనికియే తన ఉనికిగా భావిస్తూ, ఉద్యోగి సకారాత్మక వైఖరితో, మరింత శ్రద్ధతో, నిబద్ధతతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రేరణను అందివ్వాలే కాని వారిలో ఆత్మన్యూనతా భావాన్ని నింపకూడదు.

ఉద్యోగి తన పరిమితులను అధిగమించి బృందంతో కలసి సంస్థ ఉన్నతిలో మమేకమైనప్పుడే ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమవు తాయి. దానికి ఉద్యోగికి సన్మానాలు లేదా శిక్షలకన్నా ఉత్తమమైన ప్రేరణను అందించడం ఎక్కువగా ఉపయోగపడుతుంది. దానికి నాయకుడు బృందంలోని ప్రతి వ్యక్తికీ సంస్థ లక్ష్యాలు, సాధనలో ఎదురయ్యే అవరోధాలను గురించి స్పష్టంగా తెలియజేయాలి. లక్ష్యాలపై స్పష్టత, అవరోధాలను అధిగమించడంపై తోటివారి సలహాలను తీసుకోవడం వల్ల అందరూ లక్ష్యసాధనలో భాగస్వాములుగా భావిస్తారు. 

అలాగే, ఉద్యోగులకు వారి అవసరాలకు సరిపడిన జీతభత్యాలను ఇవ్వడం అవసరం. అంటే ఎంత? అదే పని చేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగికి విపణి వీధిలో ఎంత ఇస్తున్నారో ఆ పరిమాణంలో జీత భత్యాలను ఇవ్వడం వల్ల ఉద్యోగులు నిబద్ధతతో పని చేయడమే కాక సంస్థను విడిచి వెళ్ళే ఆలోచన చేయరు. అంతేకాక, ఉద్యోగి చేసే పనిలో తనకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకై కాలావధులలో ఆచరణాత్మకమైన శిక్షణను అందివ్వడ మూ ఉత్తమం.

అలాగే, ప్రతి ఉద్యోగి పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, దాని ఆధారంగా  పారదర్శకంగా జీతభత్యాల పెంపుదల లేదా పదోన్నతులనిచ్చే సంస్కృతిని సంస్థలో ఏర్పరచాలి. అలాంటి నిర్వాహకుడు ఉత్తమ ఫలితాలను సాధిస్తాడు. అది ఉద్యోగిలో శిక్షలకన్నా ఉన్నతమైన ప్రేరణగా నిలుస్తుంది.

ఒక్కొకమారు, సమర్థత కలిగిన ఉద్యోగి తన బాధ్యతా నిర్వహణలో పొరపాటున తీసుకున్న నిర్ణయంతో సంస్థకు పెద్ద నష్టమే వాటి ల్లవచ్చు. అందుకు ఆ ఉద్యోగిని బాధ్యుడిని చేస్తూ శిక్షించనూవచ్చు లేదా గత కాలంలో అతడు చూపిన పనితనాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ శిక్షించడం వల్ల సమర్థుడైన ఆ ఉద్యోగి సేవలను సంస్థ కోల్పోతుంది. అదే మరొక బాధ్యతను అప్పగించిన వేళ ఆ బాధ్యతను ఆ ఉద్యోగి మరింత శ్రద్ధగా నిర్వహిస్తాడు.

కాబట్టి, సమర్ధత కలిగిన ఉద్యోగుల సేవలు నిరంతరం పొందేందుకు తగిన రీతిలో ప్రేరణను కలిగించడమే ఉత్తమం కాని శిక్షల వల్ల ప్రయోజనం పరిమితమే.