calender_icon.png 27 November, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1పై అభ్యర్థులు అపోహ పడొద్దు

21-10-2024 01:31:03 AM

  1. బీజేపీ, బీఆర్‌ఎస్ నిరుద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నాయి
  2. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులెవరికీ అన్యాయం జరగదని..

బీసీ బిడ్డగా తాను భరోసా ఇస్తున్నట్లు ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమవేశంలో తెలిపారు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడ్ కేటగిరీకి అన్యాయం జరగదని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరఫున తాను భరోసా ఇస్తున్నట్లు వెల్లడించారు. జీఓ 29 తో నష్టం అనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఏ మొహం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు పదేళ్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లలో కేవలం 35 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంటర్ ఫలితాలు కూడా సక్రమంగా ఇవ్వలేని బీఆర్‌ఎస్ నేతలు తమ గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

గడిచిన పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసి చిత్తశుద్ధిని చాటుకుందని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కార్ ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా భర్తీ చేయలేకపోయిందన్నారు.