calender_icon.png 18 October, 2024 | 9:49 AM

అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూస్తా

18-10-2024 02:13:06 AM

గాంధీభవన్‌లో గ్రూప్ 1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): గ్రూప్ 1 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత తమదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. నిరుద్యోగుల పట్ల కేటీఆర్ మొసలికన్నీరు కారుస్తారని ఆయన దుయ్యబట్టారు. గ్రూప్ 1 పరీక్షకు జీవో 29 రద్దు చేసి జీవో 55 అమలు చేయాలంటూ  గురువారం గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగిన గ్రూప్1 అభ్యర్థులతో మహేశ్‌కుమార్ గౌడ్ సమావేశమై వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు.

గ్రూప్ 1 వాయిదా వేయాలని తాము అడగటం లేదని, కోర్ట్ డైరెక్షన్ తర్వాత ఓ క్లారిటీ వచ్చాక పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. మొన్నటి ప్రిలిమ్స్‌లో కొన్ని తప్పులు ఉన్నాయని పీసీసీ చీఫ్‌కు తెలిపారు. అభ్యర్థులు చెప్పిన అంశాలన్నింటిపైనా అధికారులతో చర్చిస్తామన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 40 వేలు కూడా దాటలేదన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. నిరుద్యోగుల పట్ల తాము ఎంతో చిత్తశుద్ధితో ఉన్నామని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల చిత్తశుద్ధి ఎంతో నిరుద్యోగులు తెలుసుకోవాలని కోరారు.