calender_icon.png 7 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లాక్ ప్లాస్టిక్ డబ్బాలతో క్యాన్సర్?

05-01-2025 01:25:39 AM

  1. రోజు రోజుకూ పెరుగుతున్న బ్లాక్ ప్లాస్టిక్ డబ్బాల వినియోగం
  2. డబ్బాల తయారీలో పాత ఎలక్ట్రానిక్స్ సహా రసాయనాల వినియోగం
  3. ఆహారంలోకి చేరుతున్న రసాయనాలు
  4. వాడకం తగ్గిస్తే మంచిదని నిపుణుల సూచన

న్యూఢిల్లీ, జనవరి 4: ఉద్యోగరిత్యా పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను అర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ సంస్థలు ఆహారాన్ని చక్కగా స్టులిష్‌గా ఉన్న నల్లటి ప్లాస్టిక్ కంటైనర్ బాక్సులలో తీసుకొచ్చి ఇస్తున్నారు.

అలా బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ బాక్సుల్లో వచ్చిన ఆహారాన్ని ప్రజలు ముందూ వెనక ఆలోచించకుండా తినేస్తున్నారు. అయితే బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో తీసుకొచ్చిన ఆహార పదార్థాలను తినడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్‌కు గురయ్యే అవకాశమూ ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

బ్లాక్ ప్లాస్టిక్‌ను ఎలా తయారు చేస్తారంటే..

వంటింటి పాత్రలు, ఫోర్క్, స్పూన్‌లు ఇలా చాలా రూపాల్లో ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ వస్తువులను నిత్యం జీవితంలో ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే వీటి తయారీలో ఉపయోగించే నల్లటి ప్లాస్టిక్ డబ్బాలు, పరికరాలను పాత ఎలక్ట్రానిక్స్‌తో సహా రీసైకిల్ చేసిన రకరకాల మెటీరియల్‌తో తయారు చేస్తారట.

వేడిని తట్టుకునేందుకు వాటి తయారీలో చాలా రకాలైన రసాయనాలను కలుపుతారట. డెకాబ్రోమోడిఫేనిల్ ఈథర్ వంటి రసాయాలు వేడిగా ఉన్న ఆహారంలోకి సులభంగా చొచ్చుకుపోతాయట. ఇలా రసాయనాలు కలిసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

నల్లటి ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలు

* బ్లాక్ ప్లాస్టిక్‌లో ఉండే  బిస్‌ఫినాల్ ఏ, థాలెట్ వంటి రసాయనాలు మనలో ఎండోక్రైన్ సిస్టమ్‌కు అంతరాయం కలిగిస్తాయి. దీంతో పునరుత్పత్తి సంబంధ ఆరోగ్య సమస్యలతోపాటు ఒబిసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

* చిన్న పిల్లల్లో పెరుగుదల ఆలస్యమవడంతోపాటు వాళ్ల ఐక్యూ తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. వీటితోపాటు నరాల సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట.

* బ్లాక్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం కష్టం. ఈ బ్లాక్ ప్లాస్టిక్‌కు సంబంధించిన వస్తువులను దహనం చేయడం వల్ల డయాక్సిన్లు, ఫూర్యాన్ వంటి విష పదార్థాలు గాలిలో కలుస్తాయట. దీంతో పర్యవరణానికి ముప్పు వాటిల్లడంతోపాటు ప్రజల ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుందట.

* వీటిలోని మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోని కణవ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని పలు పరిశోధనల వల్ల తెలుస్తోంది.

క్యాన్సర్ ప్రమాదం?

బీడీఆర్ ఫార్మాస్యూటికల్‌లో టెక్నికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అరవింద్ బ్లాక్ ప్లాక్టిక్ వినియోగం హానికరమని తెలిపారు. వీటి తయారీలో వాడే రసాయనాల వల్ల శరీరంలో హర్మోన్ వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు.

హెచ్‌సీజీ కాన్యర్ సెంటర్‌లోని మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ సచిన్ త్రివేది ఈ విషయం గురించి మాట్లాడుతూ బ్లాక్ ప్లాస్టిక్‌లోని బిస్‌ఫినోల్ ఏ (బీఏపీ), థాలేట్స్ రసాయనాల వల్ల కార్డియోవాసిక్యులర్, డయాబెటిస్, పునరు త్పత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. టీ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడం వల్ల శరీరంలోకి పెద్ద మొత్తంలో విషపదార్థాలు చేరతాయన్నారు.

పైన తెలిపిన ఈ ముగ్గురు వైద్య నిపుణులు బ్లాక్ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు చూపకపోయినా.. వచ్చే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్టు వెల్లడించారు. వీలైనంత వరకూ ఈ తరహా వస్తువులకు దూరంగా ఉండటమే మంచిదని పేర్కొన్నారు.