calender_icon.png 27 November, 2024 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక జిల్లాలకు క్యాన్సర్ సేవలు

28-09-2024 02:02:18 AM

ఉమ్మడి జిల్లాలో రీజినల్ సెంటర్ల ఏర్పాటు

ఒక్కో సెంటర్‌లో రూ.50 కోట్లతో అత్యాధునిక వసతులు

హైదరాబాద్‌కు రాకుండా ఉమ్మడి జిల్లాల్లోనే వైద్యం

ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో హైదరాబాద్‌కే పరిమిత మైన క్యాన్సర్ వైద్య సేవలను జిల్లాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి మిన హా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కో క్యాన్సర్ రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది.

ఇందులో భాగం గా తొలి దశలో కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కరీంనగర్‌లో సెంటర్లను నెలకొల్పాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో సెంటర్‌ను సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించనున్నారు.

ఆ తర్వాత రెండో దశలో మిగిలిన జిల్లా కేంద్రాల్లో సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, స్క్రీనింగ్ చేయడం, ఆయా జిల్లాల్లో ఉన్న క్యాన్సర్ రోగులకు ఎంఎన్‌జే హాస్పిటల్ డాక్టర్లు సూచించిన ట్రీట్‌మెంట్‌ను అందించడం వంటివి ఈ సెంటర్ల ప్రథమ లక్ష్యం.

ఇందుకోసం ఆయా సెంటర్లలో ఆంకాలజిస్టులను, రేడియాలజిస్టులను నియమించ డంతో పాటు, జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి శిక్షణ ఇస్తా రు. అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తారు. వరంగల్‌లో ఇప్పటికే ఉన్న రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే తరహాలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

ఏటా పెరుగుతున్న క్యాన్సర్ రోగులు

రాష్ర్టంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఐసీఎంఆర్ ఆధ్వర్యం లోని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్‌సీఆర్పీ) అంచనా ప్రకారం రాష్ర్టంలో ప్రతిరోజు సగటున 150 నుంచి 160 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. తెలంగాణలో 2016లో కొత్తగా 43,129 కేన్సర్ కేసులు రిజిస్టరయ్యాయి.

2018 నాటికి ఈ సంఖ్య 52 వేలకు పెరిగింది. 2030 నాటికి ఏటా  65 వేల  మందికి క్యాన్సర్ డయోగ్నోసిస్ అయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అంచనా వేసింది. క్యాన్సర్ కారణంగా ఏటా సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే ప్రమాదాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మన రాష్ర్టంలో దాదాపు 60 శాతం క్యాన్సర్లకు లైఫ్ స్టుల్‌లో వచ్చిన మార్పులు, కాలుష్యమే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

ఒక్క ఎంఎన్‌జేనే రాష్ట్రానికి దిక్కు.

రాష్ర్టంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వ కేన్సర్ హాస్పిటళ్ల సంఖ్య మాత్రం పెరగలేదు. తొలి ప్రధాని నెహ్రూ 1955లో ప్రారంభించిన ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటలే క్యాన్సర్ రోగులకు ఇప్పటికీ అండగా నిలుస్తోంది. ఇది తప్ప మరో స్పెషాలిటీ హాస్పిటల్‌ను మన పాలకులు ఏర్పాటు చేయలేదు. రాష్ర్టంలోని 4 కోట్ల మందికి ఈ ఆసుపత్రే దిక్కు.

ప్రస్తుతం ఎంఎన్‌జేలో 750 పడకలు ఉన్నా, పేషెంట్ల రద్దీకి అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో డే కేర్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. కీమోథెరపీ చేసిన పేషెంట్లను ఒకట్రెండు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి, అదే రోజు సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తున్నారు. తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు.

రోజూ 650 నుంచి 700 వరకూ ఓపీ కేసులు నమోదవుతున్నాయి. వరంగల్‌లో రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఉన్నప్పటికీ, అక్కడ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. క్యాన్సర్ రోగుల్లో 70 శాతం మందికి కీమోథెరపీ అవసరమవుతుంది. వారి కండీషన్‌ను బట్టి మూడు వారాలకు ఒకసారి కీమోథెరపీ చేయాల్సి ఉంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు.

దీంతో కనీసం నెలకు ఒక్కసారైనా రోగులు హాస్పిటల్‌కు రావాల్సి ఉంటుంది. ఆర్థికంగా చితికిపోతున్న క్యాన్సర్ రోగులకు రవాణా చార్జీలు అదనపు భామవుతాయన్న ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీ కింద రవాణా చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు రూ.20 వేలు రోగుల రవాణా చార్జీలకే చెల్లిస్తున్నామని ఎంఎన్‌జే హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.

పెరుగుతున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో పెట్టుకొని రీజనల్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు గతంలోనే నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే ఈ అంశంపై అధికారులతో సమీక్ష చేశారు.