calender_icon.png 15 October, 2024 | 5:02 AM

క్యాన్సర్ ప్రమాద ఘంటికలు

15-10-2024 02:25:16 AM

  1. పురుషుల్లో నోరు, స్త్రీలల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు 
  2. భారత్‌లోనే నోటి, పెదాల క్యాన్సర్లు అధికం
  3. క్రమంగా పెరుగుతోన్న బాధితుల సంఖ్య
  4. ప్రతి 100 కేసుల్లో 42 కేసులు బ్రిక్స్ దేశాల్లోనే నమోదు

క్యాన్సర్ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతంతో పోలిస్తే కొత్త కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. బ్రిక్స్ దేశాల్లో క్యాన్సర్ కేసులపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజాగా చేపట్టిన అధ్యయనంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తుండగా, పురుషుల్లో నోటి, పెదాల క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా ఉన్నాయని తెలిపింది.

బ్రిక్స్ కూటమిలో మరే ఇతర దేశాల్లోనూ నోరు, పెదాల క్యాన్సర్ల వల్ల ఈ స్థాయి మరణాలు లేవని నివేదిక చెబుతోంది. ఇందుకు ప్రధాన కారణంగా పొగాకు ఉత్పత్తుల వాడకమేనని తేల్చింది. మరోవైపు బ్రిక్స్ దేశాల్లో భారత్, సౌతాఫ్రికాలో క్యాన్సర్ మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 

క్యాన్సర్ వ్యాప్తి, కారకాలు, నివారణపై ఈ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరముందని సూచించింది. 

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి విజృభిస్తోంది. పూర్తిస్థాయిలో చికిత్స లేని ఈ రోగం క్రమంగా విస్తరి స్తోంది. మనదేశంలోనూ భారీగా కేసులు పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

భారత్‌లో క్యాన్సర్ బాధితుల సంఖ్య అధిమవుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో బయటపడింది. దేశంలోని పురుషుల్లో అత్యధికులు నోటి, పెదాలకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడుతున్నారని వెల్లడించింది. మిగతా ఏ దేశాల్లోనూ ఈ స్థాయిలో నోటి, పెదాల క్యాన్సర్లు ఉండటం లేదని నివేదిక వెల్లడించింది. మహిళల్లో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 

బ్రిక్స్ దేశాల్లో 42 శాతం మరణాలు

ఐసీఎంఆర్ అధ్యయనం ప్రధానంగా బ్రిక్స్ దేశాలపై దృష్టి సారించింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల్లో క్యాన్సర్ కేసులు, దాని కారణంగా సంభవిస్తున్న మరణాలు, ప్రజల జీవితంపై దాని ప్రభావం అనే అంశాలతో కూడిన అధ్యయనాన్ని ఐసీఎంఆర్ విడుదల చేసింది. ఆయా దేశాల్లో వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా ఎంత మంది మరణించారనే గణాంకాలను పొందుపరిచారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కారక మరణాల్లో 42 శాతం మరణాలు బ్రిక్స్ దేశాల్లోనే నమోదవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. స్త్రీ, పురుషుల్లో కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పరంగా బ్రిక్స్ దేశాలన్నింటిలోకెల్లా రష్యా ప్రథమ స్థానంలో ఉన్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది.  

భారత్‌లోనే నోటి, పెదాల క్యాన్సర్లు

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ఇండియాతోపాటు సౌత్ ఆఫ్రికాలో కొత్తగా నమోదయ్యే క్యాన్సర్ కేసులతోపాటు ఈ మహమ్మారి సంబంధిత మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరగనుంది. ఇండియా వరకూ పురుషుల్లో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో అత్యధికంగా 15.6 శాతం కేసులు నోటి, పెదాలకు సంబంధించినవే కాగా మహిళల్లో 26.6 శాతం కేసులు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించినవి.

బ్రిక్స్ దేశాలు సుస్థిరమైన ఆర్థిక ప్రగతిని కోరుతూ క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించే ప్రణాళికలను కలిగి ఉన్నప్ప టికీ క్యాన్సర్ వ్యాప్తి కారకాలు, దాని ప్రభావం తగ్గించేందుకు అవసరమైన హెల్త్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసే విషయంలో పరిశోధనలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

భారత్ మరణల సంఖ్య

క్యాన్సర్ రకం మరణాలు

బ్రెస్ట్ 98, 337 

నోరు, పెదాలు 79, 979 

సెర్విక్స్ యుటెరి 79,906

లంగ్ 75,031

ఓసోఫేగస్ 66,410