calender_icon.png 7 November, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ కాంట్రాక్టు రద్దు

07-11-2024 01:55:11 AM

  1. మేఘా సంస్థతో ఒప్పందం రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  2. తాజాగా మల్లన్నసాగర్ నుంచి జంట జలాశయాలకు నీరు 
  3. గ్రేటర్ వాసుల తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు
  4. త్వరలో కొత్త ప్రతిపాదనలకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం
  5. గత కాంట్రాక్టు రద్దుతో 2 వేల కోట్లు మిగులుతాయని అంచనా 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్)తో కుదుర్చుకున్న కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది.

ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని స్థానంలో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే కొత్త ప్రతిపాదనలను సిద్ధంచేసింది. ఇందుకు సంబంధించి టెండర్లను త్వరలోనే పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గతంలో కొండ పోచమ్మసాగర్ నుంచి 

కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీనితో 2050 వరకు నగర తాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా కేశవాపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను రూ.4,777.59 కోట్లతో నిర్మించాలని 2018 ఫిబ్రవరి 3న పరిపాలనా అనుమతి ఇచ్చింది.

మేఘా సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే, ఇప్పటివరకు పనులే ప్రారంభం కాలేదు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణ అంచనాలను సవరించాలని మేఘా కంపెనీ కోరింది. ఈ క్రమంలో పాత కాంట్రాక్టునే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా రూ.౨ వేల కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నది. తక్కువ ఖర్చుతో కొత్త ప్రాజెక్టును రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం గోదావరి ఫేజ్‌౨లోని మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు ౫ టీఎంసీల చొప్పున గోదావరి నీటిని మళ్ళిస్తారు.

ఇతర అవసరాలకు మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ కొత్త ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర పడింది. సీఎం ఆదేశాలతో సవరించిన పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేశారు.

రెండు చోట్ల మాత్రమే ఎత్తిపోత 

కొత్త ప్రాజెక్టులో నిర్వహణ, విద్యుత్తు ఖర్చులను తగ్గించడానికి గ్రావిటేషన్‌తోనే నీటిని తరలించాలని ప్రతిపాదించారు. పాత డిజైన్ ప్రకారం అక్కారం, మర్కూక్, కొండపోచమ్మసాగర్, బొమ్మరాసిపేట, ఘన్‌పూర్ వద్ద మొత్తం అయిదుసార్లు నీటిని ఎత్తిపోయాల్సి ఉండేది. కొత్త ప్రతిపాదనల ప్రకారం మల్లన్నసాగర్, ఘన్‌పూర్‌ల వద్ద రెండుసార్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తూ హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది.

నేరుగా మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్, అక్కడి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, ఇతర అవసరాలకు ౧౫ టీఎంసీలను జంట జలాశయాలకు పంపింగ్ చేస్తారు. ఈ మార్పుతో ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు పొడవు దాదాపు 162 కి.మీ.లకు పెరుగుతుంది.

ప్రస్తుతం నీటి సరఫరాకు ఒక్కో కేఎల్‌డీకి రూ.48 అవుతోంది. కొత్త ప్రతిపాదనల వల్ల ప్రతి కేఎల్‌డీకి రూ. 4 మాత్రమే ఖర్చు అవుతుంది. దీనితోపాటు మూసీ పునరుర్జీ వనంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో గోదావరి జలాలను నింపాలనే రాష్ట్ర ప్రభుత్వ భారీ సంకల్పం కూడా నెరవేరనున్నది.