calender_icon.png 24 October, 2024 | 7:01 AM

బీఆర్‌ఎస్ పార్టీకి ఫైన్ రద్దు

24-10-2024 02:41:27 AM

సింగిల్‌బెంచ్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): నల్లగొం డ జిల్లా బీఆర్‌ఎస్ ఆఫీస్ బిల్డింగ్ క్రమబద్ధీకరణ వ్యవహారంపై ఉత్తర్వులు జారీచేసిన తర్వాత అదే అంశంపై రెండోసారి పిటిషన్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి విధించిన రూ.లక్ష జరిమానా ఆదేశాలను ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది.

సెప్టెంబర్ 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరిస్తూ చీఫ్ జస్టిస్ బెంచ్ బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా కార్యాలయ భవనాన్ని క్రమబద్ధీకరించాలని ఆన్‌లైన్‌లో జూలై 3న చేసుకున్న దరఖాస్తును మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తిరస్కరిస్తూ జూలై 20న ఉత్తర్వులు జారీ చేశారు.

అనధికారిక నిర్మాణాన్ని 15 రోజుల్లో తొలగించాలని, లేని పక్షంలో మున్సిపల్ అధికారులే కూల్చివేస్తారని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను రద్దు చేయాలని, నల్లగొండ సర్వే నంబర్ 1506లోని ఎకరం స్థలంలోని నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేలా కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలివ్వాలన్న బీఆర్‌ఎస్ అభ్యర్థనను గతంలో సింగిల్ జడ్జి తోసిపుచ్చారు.

ఈ వివాదాల అప్పీళ్ల విచారణకు ప్రభుత్వం మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని, కాబట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేవరకు కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రెండోసారి  నల్లగొండ బీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సింగిల్ జడ్జి పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించారు.

ఈ ఆదేశాలపై పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణను పూర్తి చేసి తుది ఉత్తర్వులను వెలువరించింది. మున్సిపల్ కమిషనర్ చర్య చట్టానికి అనుగుణంగానే ఉన్నందున సింగిల్ జడ్జి ఇచ్చిన కూల్చివేత ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో రూ.లక్ష జరిమానా విధింపు ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.