గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో
జిల్లాల వారిగా పాత పద్ధతిలోనే టెండర్లు పిలవాలని నిర్ణయం
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సరఫరా చేసే రేషన్ సరుకులను రాష్ట్రవ్యాప్తంగా ఒకరికే అప్పగించాలని గిరిజన కో ఆఫరేటివ్ కార్పోరేషన్ తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాత విధానంలోనే జిల్లాల వారిగా టెండర్లు పిలవా లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో.. గిరిజన కోఆపరేటిట్ కార్పొరేషన్ మరోసారి టెండర్ ఆహ్వానించింది.
అయితే గతంలో జిల్లాల వారిగా ఇచ్చే టెండర్ విధానం కాకుండా.. కొత్త విధానం తీసుకొచ్చి రూ. 80 కోట్ల టెండర్‌ను రాష్ట్రంలో ఒకరికే అప్పగించేందుకు రూ. 100 కోట్ల టర్నోవర్‌తో పాటు ఈఎండీ రూ. 60 లక్షలు ఉండాలని గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ షరతు విధించింది. దీంతో తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్ట్ అప్పగించా లనే కుట్ర జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని ‘సెంట్రలైజ్డ్ టెండర్‌లో మతలబేంటి?’ అనే శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో జూలై 21న వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి విచారణ చేయాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
మిగతా ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో జిల్లాల వారిగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఒక గిరిజన గురుకులంలోనే ఈ కొత్త విధానం తీసుకురావడంతో ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికే టెండర్ ఇవ్వడం వల్ల.. సకాలంలో గురుకులాలు, హాస్టళ్లకు రేషన్ సరుకులు, కాస్మోటిక్ వస్తువులు, పాలు, కూరగాయలు చేరడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాకుండా టెండర్ పొందిన కాంట్రాక్టర్.. జిల్లాల వారిగా సబ్ కాంట్రాక్టు ఇచ్చుకునే ప్రమాదం ఉందని, దాంతో గురుకులాలు, సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు నాణ్యమైన రేషన్ సరుకులు సరఫరా చేయడం సాధ్యంకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టెండర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విధ్యను అభ్యసించే గిరిజన విద్యార్థులకు రేషన్ సరుకులు, శానిటేషన్, కాస్మోటిక్, పాలు, కూరగాయలు ఇతర వస్తువులకు వేర్వేరుగా ఈ టెండర్లను గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆహ్వానించింది. ఆగస్టు 4 వరకు ఈ దాఖలు చేయాలని, 6న దరఖాస్తులకు సంబంధించి సాంకేతిక అంశాలను ధృవీకరించిన తర్వాత ఆగస్టు 7న బిడ్ ఒపెన్ చేసి.. టెండర్‌ను ఖరారు చేయనున్నారు. పుడ్ ప్రొవిజన్, శానిటేషన్ వస్తువులకు ఈఎండీ రూ. 2 లక్షలు, కాస్మోటిక్ వస్తువులకు ఈఎండీ రూ. 1 లక్ష, ప్రెషబుల్ వస్తువులకు (పాలు, పెరుగు, కూరగాయలు, ఇతర వస్తువులు) ఈఎండీగా రూ. 2 లక్షలు నిర్ధారించారు.