calender_icon.png 24 December, 2024 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ కుంగుబాటు కేసు నోటీసులు రద్దు చేయండి

24-12-2024 01:38:05 AM

  1. హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్
  2. నేడు విచారణ జరపనున్న న్యాయమూర్తి

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు నిర్మాణాల్లో అక్రమాలే కారణమంటూ కింది కోర్టులో దాఖలైన కేసులో జారీ అయిన నోటీసులను రద్దు చేయాలంటూ.. ఆ ఫిర్యాదులో నిందితులైన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖ ర్‌రావు, అప్పటి ఇరిగేషన్ మంత్రి టీ హరీశ్‌రావులు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మేడిగడ్డ కుంగుబాటుకు అక్రమాలు, అవినీతి కారణమనే కేసులో కేసీఆర్, హరీశ్ రావులతోపాటు అధికారులు, కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ  జయశంకర్ భూపాలపల్లి మొదటి తరగతి జ్యుడిషయల్ మేజిస్ట్రేటట్ కోర్టులో సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి పిటిషన్ వేశారు.

రాజలింగమూర్తి 2023, నవంబర్ 7న వేసిన పిటిషన్‌లోని అంశాలు తమ పరిధిలోకి రావంటూ ఈ ఏడాది జనవరి 12న మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీనిపై రామలింమూర్తి భూపాలపల్లి సెషన్స్ కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.

రివ్యూ పిటిషన్‌పై ప్రిన్సిపల్ సెక్షన్స్ జడ్జి కోర్టు విచారణ జరిపి కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్‌అండ్‌టీ సంస్థకు నోటీసులు జారీచేసింది. జూలై 10న నోటీసులు జారీచేయడం చట్ట వ్యతిరేకమని కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో తమను ప్రతివాదులుగా చేరుస్తూ దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేట్ వ్యక్తి పిటిషన్(ఫిర్యాదు)పై విచారణ జరిపే అధికార పరిధి సెషన్స్ జడ్జికి లేదన్నారు. ఈ మేరకు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పిటిషన్‌ను కొట్టేస్తూ గతంలో తీర్పు చెప్పారని గుర్తు చేశారు. ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే సెషన్స్ కోర్టు విచారణ చేపట్టడానికి వీల్లేదన్నారు.  

ఈ ప్రైవేట్ ఫిర్యాదు తమ పరిధిలోకి రాదని, అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు పరిధిలోని వ్యవహారమంటూ మేజిస్ట్రేట్ గత జనవరి 12న ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తీర్పును సెషన్స్ కోర్టు సమీక్ష చేయడానికి వీల్లేదన్నారు. దీనిపై సెషన్స్ కోర్టు అభ్యంతరాలను తిరస్కరించి పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని జూలై 10న ఇచ్చిన ఆదేశాలు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.

ఆగస్టు 5న ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కూడా కోరారు. ఒకసారి మేజిస్ట్రేట్ చట్ట నిబంధనలను ఉదహరిస్తూ స్పష్టమైన ఆదేశాలను వెలువరించాక దానిపై సెషన్స్ కోర్టు న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదన్నారు. మేజిస్ట్రేట్ నిర్ణయం చట్టబద్ధంగా లేనప్పుడు సీఆర్పీసీలోని 397, 401 సెక్షన్ల కింద సెషన్స్ కోర్టు/హైకోర్టు రివ్యూ చేయవచ్చునని, అయితే ఇక్కడ మేజిస్ట్రేట్ సరైన చట్టబద్ధమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

రివ్యూను అనుమతించకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయంటూ సెషన్స్ జడ్జి పేర్కొన్న కారణం సహేతుకంగా లేదన్నారు. కాబట్టి, మేజిస్ట్రేట్ నిర్ణయంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌లో సెషన్స్ జడ్జి జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సెషన్స్ జడ్జి కోర్టు జోక్యం చేసుకోవడం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు వ్యతిరేకమన్నారు. 

తప్పుడు సంకేతం..

తొలుత మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులే చట్టబద్ధమని, అయితే చట్ట నిబంధనలకు విరుద్ధంగా  సెషన్స్ కోర్టు రివ్యూ పిటిషన్‌పై విచారణ చేయడం చెల్లదన్నారు. సీఆర్పీసీలోని 161 సెక్షన్ కింద విచారణ పరిధి లేదని మేజిస్ట్రేట్ తీర్పు చెప్పిన తర్వాత దానిపై ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జికి క్రిమినల్ రివ్యూ పిటిషన్‌పై సమీక్షకు ఆస్కారమే లేదన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఫిర్యాదును  కొట్టివేయాలని కోరారు. సెషన్ కోర్టు నోటీసులను రద్దు చేయాలని, సెషన్స్ కోర్టు విచారణను రద్దు చేయాలని కోరారు. ఒకసారి మేజిస్ట్రేట్ తనకు అధికార పరిధి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత అదే అంశంపై పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు.

పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కొట్టివేశాక సెషన్స్ జడ్జి రివిజన్ కింద విచారణ చేపట్టడం చట్ట వ్యతిరేకమన్నారు. తమకు నోటీసులు జారీ చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. తొలుత విచారణ చేపట్టలేమని అభిప్రాయపడిన సెషన్స్ జడ్జి..

ఒకవేళ పిటిషన్‌పై విచారణ చేపట్టకుంటే సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అవుతుందేమో అనే కారణంగా పిటిషన్‌ను అనుమతించడం ద్వారా  తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అయ్యిందన్నారు. సెషన్ కోర్టులో పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.  కేసీఆర్, హరీశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టనున్నారు.