calender_icon.png 19 October, 2024 | 10:05 AM

ఎల్వోసీ రద్దు చేయండి: -సజ్జల

19-10-2024 01:42:33 AM

అమరావతి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): పోలీసులు తనపై లుక్ ఔట్ సర్కులర్ (ఎల్వోసీ) ఇవ్వడాన్ని వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. లుక్ ఔట్ సర్కులర్‌ను రద్దు చేయాలని శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈ నెల 4న ఆదేశించిన తర్వాత ఈ నెల 10వ తేదీన తనపై పోలీసులు ఎల్వోసీ జారీ చేయడం కోర్టు ధిక్కారం అవుతుందని తెలిపారు. పోలీసుల చర్య చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోలీసుల చర్యలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎల్వోసీ ప్రతిని కూడా పోలీసులు ఇవ్వలేదని తెలిపారు.

ఈ నెల 4న ఇండోనేషియా నుంచి ఢిల్లీ తిరిగి వచ్చినప్పుడు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీవోఐ) అధికారులు తనకు ఎల్వోసీ గురించి చెప్పారని పేర్కొన్నారు. ఎల్వోసీని రికార్డుల నుంచి తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణ చేసే అవకాశముంది.