కలెక్టర్ క్రాంతి వల్లూరును కోరిన నల్తూరు గ్రామస్తులు...
పటాన్ చెరు: జిన్నారం మండలం నల్తూరు గ్రామంలోని సర్వే నెంబర్ 160 లో ఏర్పాటు చేస్తున్న కంకర క్రషర్ అనుమతులను వెంటనే రద్దు చేసి నల్తూరు గ్రామాన్ని కాపాడాలని గ్రామస్తులు కలెక్టర్ క్రాంతి వల్లూరును కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. నల్తూరు గ్రామంలో కంకర క్రషర్ ఏర్పాటు చేయొద్దని, అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇచ్చిన లేఖను కలెక్టర్ క్రాంతి, మైనింగ్ శాఖ అధికారులకు గ్రామస్తులు అందజేశారు. ఇదే విషయమై కలెక్టర్ తో, మైనింగ్ శాఖ ఏడి తో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు. గ్రామానికి అనుకొని ఏర్పాటు చేస్తున్న కంకర క్రషర్ తో ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయని, పచ్చని పంట పొలాలు పాడవుతాయని, ఇష్టంగా నిర్మించుకున్న ఇండ్లు బీటలు పారుతాయని కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని క్రషర్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరారు.