హైదరాబాద్ (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)ఉద్యోగులను తన ప్రీమియం పేరోల్ అకౌంట్‌లో చేర్చడానికి సంబంధించి ప్రముఖ జాతీయ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ మంగళవారం ఎస్‌సీఆర్‌తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రీమియం పేరోల్ ఖాతాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలను కెనరాబ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ హెడ్ , జనరల్ మేనేజర్ కూడా అయిన బి చంద్రశేఖర ఈ సందర్భంగా వివరించారు. రూ.100లక్షల వరకు ఉచిత వ్యక్తిగత, విమాన ప్రమాద బీమా, రూ.10 లక్షల ఉచిత గ్రూప్ టర్మ్ జీవిత బీమా, లాకర్లకు రాయితీతో కూడిన అద్దె వంటివి ఈ పథకం కింద లభిస్తాయని ఆయన వివరించారు.
అంతేకాకుండా డెబిట్ కార్డుపై ప్రమాద బీమా. తాత్కాలిక ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, రుణాలు, ప్రాసెసింగ్ ఫీజుల విషయంలో రాయితీలు వంటివి కూడా ఈ పథకం కింద లభిస్తాయనిఆయన తెలిపారు. తమతో ఈ చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు ఎస్‌సీఆర్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పి కిశోర్ బాబు కెనరా బ్యాంక్‌ను అభినందించారు.ఈ ఒప్పందాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ఇరు పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని ఆయన తెలిపారు.