24-03-2025 05:13:22 PM
- చెరువులు, కాలువలను కబ్జా చేస్తే చర్యలు తప్పవు..
- ఇరిగేషన్ డిఈ చెన్నకేశవ రెడ్డి..
- కబ్జాకు గురైన కాలువను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు..
- ఆక్రమణలను తొలగించాలన్న డిఈ..
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): చెరువులు, కాలువలను కబ్జా చేస్తే చర్యలు తప్పవని ఇరిగేషన్ డిఈ చెన్నకేశవ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామ పరిధిలో నాగులమ్మ చెరువు నుండి భూరుకుంటకు వెళ్లే ప్రధాన కాలువ కబ్జా విషయంపై మత్స్యకార్మికులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కాలువ కబ్జా జరిగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ ఇరిగేషన్ డిఈ చెన్నకేశవ రెడ్డి, ఏఈ హరిత లతో కలిసి పరిశీలించారు. పోల్కంపల్లీ లోని పోల్కమ్మ గుడి సమీపంలోని సర్వేనెంబర్ 85 లో 3.31 గుంటల భూమిని దేవరకొండ మూర్తి అనే వ్యక్తి కొనుగోలు చేసి, ఈ భూమికి అనుకొని ఉన్న కాల్వను కబ్జా చేసి ఫ్రీ కాస్ట్ గోడలను నిర్మించారు.
ఈ సందర్భంగా డిఈ కేశవరెడ్డి మాట్లాడుతూ.. పోల్కంపల్లిలో కాలువ కబ్జా వాస్తవమేనని, అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్రీ కాస్ట్ గోడలను తొలగించాలన్నారు. అదేవిధంగా అందులో ఉన్న కతాన్ చెరువు కట్ట, మిగితా భూమి కబ్జాకు విషయంపై రికార్డులను పరిశీలన చేసి నివేదిక వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మత్స్యకార్మిక శాఖ సంఘం మాట్లాడుతూ.. నాగులమ్మ చెరువు నుండి అక్కచెల్లెల చెరువుకు వరకు పాదాలకు ఆరు కిలోమీటర్ల వాగు నుండి వచ్చే నీరు, నాలుగు గ్రామాలైన పోల్కంపల్లి, నాగన్ పల్లి, నెర్రపల్లి, అనాజ్ పూర్ గ్రామాల రైతులకు జీవనాధారంగా ఉండేదని తెలిపారు.
ఈ కాలువను కబ్జా చేసి పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్మించడంతో నీటి ప్రవాహం తీవ్రంగా ప్రభావితమైందనీ, ఇది మత్స్యకారులు, రైతులు, పశువుల పెంపకం చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కతాన్ చెరువు కట్ట విషయమై ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికారులు పరిశీలన చేసి, వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మత్సశాఖ ఆధ్వర్యంలో అక్రమాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార్మిక శాఖ అధ్యక్షులు గోరేంకల నరసింహ, జిల్లా అధ్యక్షులు చెనమోని శంకర్, గ్రామ అధ్యక్షుడు కావలి లక్ష్మయ్య, మత్స్యకార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.