- నిజ్జర్ కేసులో మోదీ పేరు ప్రస్తావన?
- కెనడా మీడియాలో వార్తా కథనాలు
- ఖండించిన భారత విదేశాంగ శాఖ
న్యూఢిలీ, నవంబర్ 21: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా మీడియాలో నిరాధార ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. త్వరలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ట్రూడో సర్కారు ఏదో ఒక రూపంలో ఇండియాను రెచ్చగొట్టడానికి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.
తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా నిజ్జర్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల్లో ఒకరని కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తాపత్రిక ఓ నిరాధార కథనాన్ని ప్రచురించింది. ఈ కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ హస్తం కూడా ఉన్నట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నది.
అయితే ఈ కథనాలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కెనడా వార్తా పత్రికల్లో వచ్చిన నిరాధార కథనాలపై తాము స్పందించబోమని తెలిపారు. ఇటువంటి హాస్యాస్పద, ఊహాజనిత వార్తలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంంబంధాలను మరింత దిగజారుస్తాయని పేర్కొన్నారు.
ఇటువంటి అర్థంలేని కథనాలను కొట్టిపారేస్తున్నామని చెప్పారు. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.