calender_icon.png 25 October, 2024 | 5:51 AM

భారత్‌కు కెనడా వెన్నుపోటు

25-10-2024 03:13:25 AM

ఇండియా పట్ల కెనడా 

అనైతికంగా ప్రవర్తించింది

అక్కడ ట్రూడో గెలుపు ఇక కష్టమే

భారత దౌత్యవేత్త సంజయ్‌కుమార్‌వర్మ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కెనడా ప్రవర్తిస్తున్న తీరుపై ఆ దేశంలో భారత హైకమిషనర్‌గా వ్యవహరించిన సంజయ్‌కుమార్‌వర్మ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. భారత్ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కెనడా వెన్నుపోటు పొడించిందని మండిపడ్డారు. అక్కడి ట్రూడో ప్రభుత్వం భారత్ పట్ల అనైతికంగా ప్రవర్తించిందని ధ్వజమెత్తారు. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంపై మాట్లాడిన సంజయ్.. కెనడాలో ప్రధాని ట్రూడో ఇక గెలవలేరని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయన గెలుపు చాలా కష్టమని జోష్యం చెప్పారు. కెనడాలో దౌత్యవేత్తలపై అక్కడి ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో సంజయ్‌ను భారత్ వెనక్కి పిలిచింది. నిజ్జర్ హత్య కేసులో సంజయ్ భారత వైఖరిని బలంగా వినిపించారు. భారత్‌కు వచ్చిన తర్వాత జాతీయ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా విధానంపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. 

కెనడా అక్రమాలకు అడ్డా

భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా కెన డా ప్రవర్తించింది. ఆ దేశంలో భారత్ ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించలేదు. కానీ భారత్‌పై కెనడా ఆరోపణలు చేసింది. కానీ అందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం చూపించలేకపోయింది. అక్కడి న్యాయవ్యవస్థ బలహీ నంగా ఉండటం వల్లనే ఖలిస్థానీలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ ఉన్న సిక్కు ల్లో చాలా తక్కువ మందే ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారు. మిగిలినవారిని భయభ్రాంతు లకు గురిచేయడంతో పాటు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ మేరకు భారత దౌత్యవేత్త సంజయ్‌కుమార్‌పై నిందమోపగా.. హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది.