కెనడా వలస విధానాల్లో మార్పుల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ తో సహా 16 దేశాలకు చెందిన విద్యార్థులు త్వరగా వీసాలు పొందటానికి సహాయపడే ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్‌డీఎస్)ప్రోగ్రామ్‌తో పాటు నైజీరియా స్టూడెంట్స్ ఎక్స్‌ప్రెస్ పథకాన్ని కెనడా గతవారం రద్దు చేసింది.
కెనడాలో ఉద్యోగం రావడం వల్ల అక్కడ శాశ్వత నివాసం పొందటానికి అవకాశం కల్పించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల (పీజీడబ్ల్యూపీ )అర్హతల్లోనూ ట్రూడో ప్రభుత్వం గత ఏడాది మార్పులు చేసింది. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ విద్యార్థి అనుమతులపై రెండేళ్ల పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలతో కెనడా వెళ్లాలనుకున్న భారతీయ విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. కేరళకు చెందిన ఓ విద్యార్థి కెనడాలోని యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఫీజు కట్టిన తర్వాత ఆ సీటును వదిలేసుకున్నారు.
ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెంట్ తరపున గత ఏడాది 50 మంది విద్యార్థులు కెనడా వెళితే, ఈసారి నలుగురికి పరిమితమైంది. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఫ్రాన్స్, ఐర్లాండ్ ,న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆ కన్సల్టెంట్ నిర్వాహకులు తెలిపారు. 2023లో భారత విద్యార్థుల నమోదు 29 శాతం పెరిగిందని ఆస్ట్రేలియా హై కమిషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 1 నాటికి ఇతర దేశాల కంటే, కెనడాలో అత్యధికంగా 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఆ తర్వాత అమెరికాలో 3.37 లక్షలు,యూకేలో 1.85 లక్షలు, ఆస్ట్రేలియాలో 1.2 లక్షల మందికి పైగా ఉన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్‌లోను అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు.
తెలుగు యువత అగచాట్లు
ఉత్తర అమెరికాలో శాశ్వత నివాస వసతి పొందే అవకాశం ఉన్నది. అందుకే కెనడాలో బంగారు భవిష్యత్తు కోసం తెలుగువారు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు. వారితోపాటు, వేల మంది భారతీయ యువకులను కూడా కెనడా దేశంలో మారుతున్న నివాస వీసా నిబంధనలు అనేక ఇబ్బందులు పెడుతున్నాయి. గతంలో ఉన్న అవకాశాలు ఇప్పుడు లేవు. అక్కడ మన వారికి ఉపాధి అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఇటీవల కెనడా,-భారత్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో మన వాళ్లు అక్కడ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
అనేక పార్ట్ టైం ఉద్యోగాలపై ఆశతో పెద్ద సంఖ్యలో మన విద్యార్థులు గతంలో కెనడాకు వెళ్లటానికి ఆసక్తి చూపే వారు. ఇప్పుడు కెనడాలో పరిస్థితి తిరగబడింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక మన తెలుగు విద్యార్థ్ధులు మానసిక రుగ్మతలకు గురై మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. మొన్నటివరకు సునాయసంగా లభించే శాశ్వత నివాస వీసాలు ఇప్పుడు కఠినతరం అయ్యాయి.
కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉండే వారు. ఇప్పుడు ఆ దారులను కెనడా ప్రభుత్వం మూసివేసింది. ప్రస్తుతం అక్కడ ఉన్న మనవారు 10 డాలర్లకు ఐదు సమోసాలు పంజాబీల నుండి కొనుగోలు చేస్తున్నారు అంటే అక్కడ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి పోయాయి. ఉపాధి లేదు. క్లీనర్, సెక్యూరిటీగార్డ్ ఉద్యోగాలు కూడా దొరకటం లేదు.
నిబంధనలకు వ్యతిరేకంగా రోజుకు 20 గంటలు పని చేయించుకొని అక్కడి పంజాబీ,గుజరాతీ వ్యాపారులు మనవాళ్లకు సగం జీతం ఎగ్గొడుతూ శ్రమ దోపీడీ చేస్తున్నారు. ఇక మన దేశ విద్యార్థులకు కెనడాకు ,అటునుంచి ఉత్తర అమెరికా వెళ్లే ఛాన్సులు మూసుకు పోయినట్లే. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారు. ఆయన విదేశీ వలసలకు వ్యతిరేకి. లక్షల సంఖ్యలో అక్కడ ఎంతో కాలంగా స్థిరపడిన వారు సైతం ట్రంప్ భయంతో తలో దిక్కు ఆశ్రయం కోసం పరుగులు పెడుతున్నారు.
అక్కడఉన్న వారే ఉద్యోగం,ఉపాధి కోల్పోయి వీసా నిబంధనలు కఠినతరం కావటంతో వారంతా అక్రమ వలసదార్లు అనే ముద్ర పడిపోతోంది. పోలీసుల అరెస్టులు, జైలు శిక్షలకు భయపడి అక్కడ నుండి పారిపోతుంటే ... కొత్తగా అమెరికా వెళ్లాలని డిగ్రీ పట్టాలు చేతపట్టుకొని కలలు గనే మన విద్యార్ధుల ఆశల కలలపై నీళ్ళు చల్లినట్లే.
- డా.కోలాహలం రామ్ కిశోర్