calender_icon.png 30 November, 2024 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరేంజు చూపేనా?

30-11-2024 12:08:19 AM

ఐపీఎల్‌లో చాలా జట్లకు లేని స్పెషాలిటీ సన్ రైజర్స్‌కు ఉంది. అదే ఆర్మీ. పోయినేడాది తుది మెట్టుపై బోల్తాపడి టైటిల్ కోల్పోయిన కమిన్స్ సైన్యం మరి ఈ దఫా ఆ లోటును తీరుస్తుందో. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ లేని లోటును ఆరెంజ్ ఆర్మీ ఎలా భర్తీ చేస్తుందో... 

  1. పేపర్‌పై బలంగా ఆరెంజ్ ఆర్మీ
    1. షమీ రాకతో పెరిగిన బౌలింగ్ బలం
    2. భువీ లేని లోటు తీరేనా?

విజయక్రాంతి, ఖేల్ విభాగం : ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు హైదరాబాద్ ప్రాంచైజీ పేపర్ మీద ఎప్పుడూ బలం గా కనిపించినా టోర్నీలో మాత్రం పెద్దగా సంచలనాలు నమోదు చేయకుండానే వెనుదిరిగింది. కానీ గతేడాది హెడ్, అభిషేక్ లెక్క మార్చారు. కొత్త కెప్టెన్ రాకతోనే కొంగొత్త ఆర్మీని పరిచయం చేశాడు.

రూ. 20.50 కోట్లు వెచ్చించి మినీ వేలంలో ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌ను కొనుగోలు చేయడంతో ఆర్మీ దశ తిరిగింది. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మన బ్యాటర్లు రెచ్చిపోయారు. సన్ రైజర్స్‌తో మ్యాచ్ అంటేనే ఇతర జట్ల బౌలర్లు భయపడేలా చేశారు.

ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయి కోల్‌కతాకు కప్పును అప్పగించేశారు. ఆ ఒక్క ఓటమి తప్పిస్తే 2024 ఐపీఎల్ సీజన్ ఆరెంజ్ ఆర్మీకి, ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు మధుర స్మృతులనే మిగిల్చింది.  

అభి‘షేక్’.. 

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి.. ఈ యువ సంచలనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగే శర్మ కొడితే బౌలర్లకు చుక్కలు కనిపించేవి. అభిషేక్ పవర్ ప్లే ఆడితే రైజర్స్ ఆ మ్యాచ్‌లో కచ్చితంగా 200+ స్కోరు చేస్తుందని అభి మానులు ఫిక్స్ అయిపోయేవారు. అటువంటి ఆరంభాలను హెడ్‌తో కలిసి అందించేవాడు. 

బౌలర్లకు ‘హెడ్’ ఏక్

మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా అరవీరభయంకరుడే. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే హెడ్ 2024లో రైజర్స్ దశ మార్చేశాడు. హెడ్ కుదరుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు ఇక కాలరాత్రే మిగిలేది. అటువంటి హెడ్ ఈ సీజన్ ఎలా ఆడతాడనే దానిమీదే రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక కూకట్‌పల్లి ‘క్లాసెన్’ చిచ్చా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలవోకగా సిక్సర్లు బాదే క్లాసెన్ క్రీజులోకి వస్తే ఏ బౌలర్‌కైనా వెన్నులో వణుకుపుట్టాల్సిందే. 

నితీశ్ చూపేనా జోష్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశాలు ఇచ్చి అతడిలోని ప్రతిభను బయటకు తీసింది రైజర్స్ యాజమాన్యమే. మరోమారు కూడా నితీశ్ సత్తా చాటితే రైజర్స్‌కు ఇక తిరుగుండదు. కమిన్స్ బౌలర్‌గా పెద్దగా రాణించకున్నా కానీ కెప్టెన్‌గా మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఎప్పుడూ అంచనాలను అందుకోలేక విఫలం అవుతున్న ఆరెంజ్ ఆర్మీ రేంజును అమాంతం పెంచడంలో కమిన్స్ వ్యూహాలు ఎంతో పని చేశాయి. 

జట్టు: అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, కమిన్స్, నితీశ్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ టైడే, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, హర్షల్, బ్రైడన్ కేర్స్, కమిందు మెండిస్, షమీ, రాహుల్ చాహర్, సమర్‌జీత్, ఉనద్కత్, జీషన్ అన్సారీ,  ఆడం జంపా, ఇషాన్ మలింగ